
తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యజిత్ విశ్వాస్ దారుణహత్యకు గురయ్యారు. పూజలో ఉండగా ఆయనపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపడంతో విశ్వాస్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళితే.. కృష్ణాగంజ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సత్యజిత్ విశ్వాస్ నదియా జిల్లా పూల్బరిలో శనివారం జరిగిన సరస్వతి పూజలో పాల్గొన్నారు. ఆయన వెంట రాష్ట్ర మంత్రి రత్నఘోష్, తృణమూల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గౌరీశంకర్ దత్తా ఉన్నారు.
కార్యక్రమం ముగిసిన తర్వాత వేదిక దిగుతుండగా కొందరు దుండగులు అతి సమీపం నుంచి విశ్వాస్‌పై కాల్పులు జరిపారు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించినప్పటికీ విశ్వాస్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు ఆయన హత్య వెనుక బీజేపీతోపాటు తమ పార్టీ నాయకుడు ముకుల్ రాయ్ ఉన్నారని టీఎంసీ నేత దత్తా ఆరోపించారు. ఈ ఆరోపల్ని ఖండించిన బీజేపీ రాష్ట్ర నేత తృణమూల్‌లోనే అంతర్గత కలహాలున్నాయని బదులిచ్చారు.
బంగ్లాదేశ్ జిల్లాలో ఉన్న నదియాలో మతువా వలసదారుల ప్రాబల్యం ఎక్కువ. ఎన్నికల్లో గెలుపొటములను ప్రభావితం చేసే ఈ వర్గం వారికి చేరువకావడానికి బీజేపీ, టీఎంసీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
మతువాలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలకు విశ్వాస్ తరుచుగా హాజరయ్యేవారు. కాగా, ఆయనకు కొద్దిరోజుల క్రితమే వివాహమైంది. ఈ నేపథ్యంలో విచారణ ప్రారంభించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీ
నిలో బీజేపీ నేత ముకుల్ రాయ్‌తో పాటు మరో ముగ్గురి పేర్లను చేర్చారు. గతంలో టీఎంసీలో ఉన్న ముకుల్ రాయ్ యూపీఏ హయాంలో రైల్వేమంత్రిగా పనిచేశారు. అనంతరం మమతా బెనర్జీతో వచ్చిన విభేదాల కారణంగా బీజేపీలో చేరారు.