
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తరుచూ రాజకీయాలు హింసాత్మకం అవుతున్నాయి. హత్యా రాజకీయాలు ఇటీవలి కాలంలో ఇక్కడ పెరిగాయి. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేను హతమార్చడానికి ప్లాన్ రెడీ అయిందని, జైలులోనే ఆ ఎమ్మెల్యేను హత్య చేయడానికి ప్రణాళికలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఏకంగా ఆ ఎమ్మెల్యేకే ఓ ఫోన్ కాల్‌లో చంపేస్తున్నట్టు ఓ నిందితుడు చెప్పాడు. దీంతో సదరు ఎమ్మెల్యే హుటాహుటిన పోలీసు స్టేషన్ చేరుకుని ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ హత్య వెనుక మాస్టర్ మైండ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పరేశ్ రామ్ దాస్ కేనింగ్ వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పరేశ్ రామ్ దాస్‌ను హతమార్చాలనే ప్లాన్ జైలులోనే రచించినట్టు సమాచారం.
క్రిమినల్ చరణ్ జిత్ హల్దార్ అలియాస్ చిరన్.. ఎమ్మెల్యే పరేశ్ రామ్ దాస్ హత్యకు పథకం వేసినట్టు ఆరోపణ. తృణమూల్ కాంగ్రెస్ నేత కమల్ ముల్లిక్‌ను ఆరు నెలల క్రితం కేనింగ్‌లోనే హతమార్చిన కేసులో చరణ్ జిత్ హల్దార్ జైలుకు వెళ్లాడు. ఈ కేసులో శిక్ష పడింది. ఈ శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే చరణ్ జిత్ హల్దార్.. ఎమ్మెల్యే పరేశ్ రామ్ దాస్ హత్యకు పథకం వేసినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి.
అయితే, చరణ్ జిత్ కొన్ని రోజుల క్రితం జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే, చరణ్ జిత్ జైలులో ఉన్నప్పుడే పరేశ్ రామ్ దాస్ హత్యకు పథకం వేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. బెయిల్ పై జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన మొనిరుల్ అనే ఓ యువకుడిని హైర్ చేసుకున్నాడు. ఆ యువకుడే ఎమ్మెల్యే పరేశ్ రామ్ దాస్‌కు ఫోన్ చేశాడు. ఆ ఎమ్మెల్యేను చంపేసే ప్లాన్ ఉన్నట్టు తెలిపాడు. దీంతో బరూయిపూర్ ఎస్పీ, కేనింగ్ పోలీసు స్టేషన్, ఇతర అధికారులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశాడు. తనను చంపడానికి జైలులోనే కుట్ర చేశారని, వారంతా బీజేపీ మద్దతుదారులు అని ఆరోపించాడు.
అయితే, ఆ వాదనలను బీజేపీ కొట్టిపడేసింది. ఈ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. అది కేవలం టీఎంసీలోని అంతర్గత కక్షల వల్లే ఫిర్యాదు చేశారని వాదించింది. కాగా, పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నరేంద్రపూర్‌లో ప్రధాన నిందితుడు చరణ్ జిత్ హల్దార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు కోర్టులో హాజరుపరిచి పది రోజుల పోలీసు కస్టడీలోకి అనుమతి కోరనున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.