CSIR:  తొలి మ‌హిళ‌ CSIR డైరెక్టర్ జనరల్‌గా నల్లతంబి కళైశీల్వి.. ఆమె గురించి ఆసక్తికర విషయాలు..

By Rajesh KFirst Published Aug 7, 2022, 7:07 PM IST
Highlights

CSIR: కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ శాస్త్రవేత్త నల్లతంబి కళైశీల్వి నియామకమయ్యారు. సీఎస్‌ఆర్‌ఐ డీజీగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. 

CSIR: సీనియర్ సైంటిస్ట్ నల్లతంబి కళైశీల్వికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఆమె కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR)కి తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఈ మేర‌కు శనివారం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. CSIR డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా చ‌రిత్ర‌ సృష్టించారు. ఇంతకు ముందు డైరెక్టర్ జనరల్‌గా ప‌ని చేసిన‌ శేఖర్ మండే ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు. 

మండే పదవీ విరమణ తర్వాత.. బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి రాజేష్ గోఖలేకు అదనంగా CSIR  బాధ్యతలు అప్పగించారు. కేంద్రం ఉత్తర్వులతో ఆయ‌న వారసురాలిగా నల్లతంబి కళైశీల్వి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె రెండేళ్ల  పాటు ఈ ప‌ద‌వీలో సేవలందించనున్నారు. లేదంటే బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు.. రెండింట్లో ఏది ముందుగా పూర్తయైతే అది వర్తిస్తుందని సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 
CSIR మన దేశంలోని 38 పరిశోధన సంస్థల కన్సార్టియం. లిథియం-అయాన్ బ్యాటరీల రంగంలో ఆమె చేసిన కృషికి గుర్తింపు పొందిన కళైశీల్వి ప్రస్తుతం తమిళనాడులోని కరైకుడిలోని CSIR-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CECRI)కి డైరెక్టర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాగే.. ఆమె సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ విభాగం కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తారు.

కళైశీల్వి CSIRలో తన కేరీర్ ను ప్రారంభించింది. ఇన్‌స్టిట్యూట్‌లో మంచి పేరు తెచ్చుకుంది. ఫిబ్రవరి 2019లో CSIR-CECRIకి అధిపతిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళగా అవతరించింది. అదే ఇన్‌స్టిట్యూట్‌లో ఎంట్రీ లెవల్ సైంటిస్ట్‌గా పరిశోధనలో తన కెరీర్‌ను ప్రారంభించారు.

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలోని అంబసముద్రం అనే చిన్న పట్టణానికి చెందిన కళైశీల్వి తమిళ మాధ్యమంలో పాఠశాల విద్యను అభ్యసించింది. తాను తమిళంలో చదవడం వల్ల కాలేజీలో సైన్స్ కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోగలిగానని చెబుతూ ఉంటారు. ఆమె ఇప్ప‌టివ‌ర‌కూ 125 పరిశోధన పత్రాలను సమర్పించింది. అలాగే.. ఆమె ఆరు పేటెంట్లను పొందారు. లిథియం – అయాన్‌ బ్యాటరీ రంగంలో విశేష కృషి చేసి, గుర్తింపు పొందారు.

కళైశీల్వి త‌న‌ 25 సంవత్సరాల పరిశోధనలు.. ప్రధానంగా ఎలక్ట్రోకెమికల్ పవర్ సిస్టమ్స్,  ఎలక్ట్రోడ్‌ల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఆమె ప్రస్తుతం సోడియం-అయాన్/లిథియం-సల్ఫర్ బ్యాటరీలు, సూపర్ కెపాసిటర్ల అభివృద్ధిపై కృషి చేశారు.  ఆమె  'నేషనల్ మిషన్ ఫర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ'కి కూడా ముఖ్యమైన సహకారాన్ని అందించారు.

click me!