మూడు హత్యలు, దోపిడిగా చిత్రీకరణ: కారే పట్టించింది, అంతా తల్లి కోసమే

By Siva KodatiFirst Published Jul 30, 2019, 9:32 AM IST
Highlights

తిరునల్వేలి మాజీ మేయర్ ఉమామహేశ్వరి సహా మరో ఇద్దరిని హత్య చేేసిన కేసులో డీఎంకే మహిళా నేత కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తల్లి కోసమే ఇతను మూడు హత్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

తల్లి రాజకీయ జీవితాన్ని నాశనం చేశారన్న కక్షతో ఆమె కొడుకు ముగ్గురిని దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న డీఎంకే నేత శీనియమ్మాల్‌కు ఉమామహేశ్వరి రావడంతో ఆమె ఆధిపత్యానికి గండిపడింది.

క్రమంగా శీనియమ్మాల్‌కు డీఎంకేలో ప్రాధాన్యత తగ్గడంతో పాటు 2011 ఎన్నికల్లో శంకరన్ కోయిల్ అసెంబ్లీ టికెట్‌ను ఉమామహేశ్వరి దక్కించుకున్నారు. దీనిని జీర్ణించుకోలేకపోయిన శీనియమ్మాల్ కుమారుడు  కార్తికేయన్‌ పగతో రగిలిపోయాడు.

దీంతో తన తల్లి రాజకీయ జీవితానికి ఎర్త్ పెట్టిన ఉమామహేశ్వరిని చంపాలని అతను నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 23న కార్తీకేయన్.. ఉమా మహేశ్వరి ఇంటికి వెళ్లాడు.

తన తల్లి రాజకీయ జీవితాన్ని నాశనం చేశావంటూ వాగ్వాదానికి దిగాడు. తనతో తెచ్చుకున్న కత్తితో తొలుత ఉమామహేశ్వరి, ఆమె భర్త మురుగ చందరిన్‌‌లను హత్య చేశాడు. అనంతరం దోపిడి జరిగినట్లుగా నగలు, నగదును తీసుకున్నాడు.

ఈ సమయంలో పనిమనిషి మారిమ్మాల్ రావడంతో ఆమెను సైతం దారుణంగా హతమార్చాడు. అక్కడి నుంచి మధురైలో వెళుతూ.. తామర భరణి నదిలో ఉమామహేశ్వరి ఇంట్లో నుంచి దొంగతనం చేసిన నగలు, నగదుతో పాటు హత్యకు ఉపయోగించిన కత్తిని పడేశాడు.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు... తిరునల్వేలి కమిషనర్ ఆధ్వర్యంలో మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా ఓ చర్చి సమీపంలోని సీసీ కెమెరాలో ఓ కారు అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు.

ఆ కారు డీఎంకేకు చెందిన శీనియమ్మాల్‌ తనయుడు కార్తికేయన్‌దిగా గుర్తించారు. దీని ఆధారంగా మధురై‌లో కార్తికేయన్ తలదాచుకున్నట్లుగా గుర్తించిన పోలీసులు ఆదివారం రాత్రి అతనిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు వీలుగా నిందితుడిని సీబీసీఐడీకి అప్పగిస్తూ డీజీపి ఆదేశాలు జారీ చేశారు. అయితే తన తల్లికే తెలియకుండా కార్తీకేయన్ ఈ హత్యలు చేసివుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా.. తమ కుమారుడిని అన్యాయంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని తండ్రి సన్యాసి ఆరోపించారు. కార్తీకేయన్‌కు ఏమీ తెలియదని.. పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగానే కేసును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపడ్డారు.

click me!