
మందుబాబులు చేపట్టిన నిరసన ప్రదర్శన ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ నిరసన సందర్భంగా ప్రభుత్వం ఉదయం, సాయంత్రం ఉచితంగా మద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని ఉడిపిలో చోటుచేసుకుంది. వివరాలు.. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ సందర్భంగా రాష్ట్రంలో మద్యం ధరలను 20 శాతం పెంచనున్నట్టుగా ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై పలువురు మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉడిపిలో పలువురు కార్మికులు చిత్తరంజన్ సర్కిల్ వద్ద తమ డిమాండ్లను వినిపించేందుకు నిరసనకు పిలుపునిచ్చారు.
నిత్యానంద ఒలకడు అనే సామాజిక కార్యకర్త నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసనలో పాల్గొన్న వారంతా.. ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా ప్రకటించిన మద్యం ధరల పెంపును వ్యతిరేకించారు. ఈ సందర్భంగా వారు ఉచిత మద్యం అందించాలని అసాధారణ డిమాండ్ కూడా చేశారు. మద్యం ధరలను తగ్గించాలని లేదా ఉదయం, సాయంత్రం ఉచిత లార్జ్(90మి.లీ) మద్యం అందించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉచిత మద్యం పథకానికి ఎక్సైజ్ పన్నుల ద్వారా నిధులు సమకూరుతాయని వాదించారు. రోజంతా పనిచేసి తమ శరీరంలో ఉన్న బాధను మరిచిపోవడానికి మద్యం తాగుతామని వారు పేర్కొన్నారు.
తమ డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే.. అమ్మకాలను పూర్తిగా నిషేధించాలని ఒత్తిడి తీసుకోస్తామని చెప్పారు. మద్యానికి ఖర్చు చేసే డబ్బులను తమ కుటుంబాలను పోషించడానికి, వారి కుటుంబంతో సహా దేవాలయాలను సందర్శించడం వంటి వారి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి బాగా ఉపయోగించవచ్చని వారు వాదించారు.
వంటగ్యాస్, కరెంటు ధరలు పెంచితే ప్రజలు నిరసన తెలపుతారని.. అయితే మద్యం ధరలు పెంచినప్పుడు ఎవరూ నిరసన తెలపడం లేదని నిరసనకారులు పేర్కొన్నారు. ఇక, ఈ నిరసన సందర్భంగా నిరసనకారులు.. మద్యం సీసాలకు పూలమాల వేసి, పూజలు నిర్వహించారు.