
రాంచీ: జార్ఖండ్‌లో మూడు నెలల బాలుడు టీకా వికటించి మృతి చెందింది. ఓ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో టీకా వేయగా.. 24 గంటల్లోనే మరణించింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని రామగఢ్ జిల్లాలో చోటుచేసుకున్నట్టు వైద్యారోగ్య అధికారులు శుక్రవారం వెల్లడించారు.
ఆ బాలుడి మరణానికి గల స్పష్టమైన కారణాలు తెలుసుకోవడానికి ఓ మెడికల్ బోర్డును ఏర్పాటు చేసినట్టు రామగఢ్ సివిల్ సర్జన్ డాక్టర్ ప్రభాత్ కుమార్ తెలిపారు. ఆ బేబీకి చెందిన విసేరాను భద్రపరుస్తామని, తద్వార శిశువు మరణానికి గల కచ్చితమైన కారణాలు కనుగొనడానికి వీలవుతుందని తెలిపారు. అంతేకాదు, అరుదుగా చోటుచేసుకున్న ఇలాంటి ఘటనను రాష్ట్ర డబ్ల్యూహెచ్‌వో టీమ్ కూడా దర్యాప్తు చేస్తున్నది.
అభిరాజ్ కుమార్ అనే మూడు నెలల బాలుడికి పెంటావాలెంట్ వ్యాక్సిన్‌ను కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లోని సిబ్బంది ఇచ్చారు. డిఫ్తీరియా, పెర్టసిస్, టెటానస్, హెపటైటిస్ బీ వంటి ప్రాణాంతక రోగాలు రాకుండా ముందుజాగ్రత్తగా ఈ వ్యాక్సిన్‌ను వేస్తారు. పార్త్రూలోని సీహెచ్‌సీ సిబ్బంది ఈ టకా గురువారం మూడు నెలల బాలుడికి వేసింది. అయితే, ఆ తర్వాత ఆ శిశువు ఆరోగ్యం క్రమంగా క్షీణించినట్టు పోలీసు అధికారులు వివరించారు.
Also Read: రూ. 2 వేల కోసం 2 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన మహిళ.. బంగ్లాదేశ్ సరిహద్దులో పట్టివేత
ఆ బాలుడిని హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ, శుక్రవారం తెల్లవారుజామున ఆ బాలుడు మరణించినట్టు పోలీసులు తెలిపారు.
కాగా, బాలుడి తండ్రి బబ్లూ సావ్, తల్లి లలితా దేవిలు మాత్రం తమ కొడుకును సిబ్బంది నిర్లక్ష్యమే ప్రాణం తీసిందని ఆరోపించారు. బాధ్యులను అరెస్టు చేయాలని, వారిపై మర్డర్ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.