
ఏవోబీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బాదపడ పంచాయతీ పరిధిలోని ఖరిమల్ వద్ద బుధవారం రాత్రి ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్నవారంతా.. తంటగూడ గ్రామంలో బంధువు అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 15 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడిన వారందరినీ ప్రాథమిక చికిత్స కోసం సమీపంలోని జాన్‌బాయి వైద్యశాలకు తరలించారు. అయితే తర్వాత వారిని మెరుగైన చికిత్స నిమిత్తం చిత్రకొండ ఆసుపత్రికి తరలించారు.