మూడో భార్యను కిరాతకంగా కొట్టి చంపిన భర్త.. తన మద్యం తాగిందన్న కోపంతో దారుణం..

By SumaBala Bukka  |  First Published May 4, 2023, 3:22 PM IST

తన మద్యం తాగేసిందన్న కోపంతో ఓ వ్యక్తి తన మూడో భార్యను అతి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. 


తమిళనాడు : తమిళనాడు రాష్ట్రంలోని కన్నియాకుమారి జిల్లాలో  దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి మద్యంకోసం తన మూడో భార్యను కిరాతకంగా హత్య చేశాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను తాగుదామని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకున్న మద్యాన్ని మూడో భార్య తాగింది. దీంతో కోపానికి వచ్చిన ఆ భర్త ఆమెను హతమార్చాడని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేశామని వెల్లడించారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. డేపురాయ్ అనే  నిందితుడు పశ్చిమ బెంగాల్ కు చెందిన కార్మికుడు. అతడు తన మూడో భార్య వసంతి పకాడియాతో కలిసి కట్టలైకుళంలో  ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న ఇటుకబట్టిలో పనిచేస్తున్నాడు. కాగా ఘటన జరిగిన రోజు అతను.. తాగుదామని మద్యం తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు.

Latest Videos

ఆ మద్యాన్ని మూడో భార్య తాగింది. దీంతో ఆగ్రహానికి వచ్చిన అతను  భార్యను  కర్రతో తీవ్రంగా బాదాడు. ఆ తర్వాత నిద్రపోయాడు. ఆ తర్వాతి రోజు ఉదయం లేచేసరికి భార్య మృతి చెందింది. దీంతో కంగారుపడ్డాడు. ఆ తర్వాత దాని దొరకకుండా ఉండడం కోసం.. భార్య శరీరం మీద.. నేల మీద పడిన రక్తపు మరకలను నీళ్లతో శుభ్రం చేశాడు.  అయితే, ఇదంతా ఇటుక బట్టి యజమాని గమనించడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు డేపురాయిని అరెస్టు చేశారు. 

విషాదం.. రైతుపై దాడి చేసిన కోతుల గుంపు.. తప్పించుకునే క్రమంలో మేడపై నుంచి పడటంతో మృతి

ఇదిలా ఉండగా, తమిళనాడులోనే మద్యం మత్తులో చేసిన మరో నేరం వెలుగు చూసింది. ఉపాధి హామీ కూలీలతో ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో నగ్నంగా నిలబడి మరీ వారిని వేదించాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిమీద విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పుల్లరంబాక్కం గ్రామానికి చెందిన సుమారు 200 మంది మహిళలు స్థానికంగా ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. 

మంగళవారం నాడు ఓ వ్యక్తి మద్యం మత్తులో వారి వద్దకు వెళ్లాడు.  అతన్ని అదే గ్రామానికి చెందిన ప్రభాకరన్ గా గుర్తించారు. వారి దగ్గరికి వెళ్లిన ప్రభాకరన్ బట్టలు విప్పేసి నగ్నంగా నిలబడి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. అది చూసిన మహిళలు ముందు షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత అతడి ప్రవర్తన మీద పులరంబాక్కం పోలీస్ స్టేషన్ కి బుధవారం ఉదయం వెళ్లి ఫిర్యాదు చేశారు. 

అయితే, వీరి ఫిర్యాదును పోలీసులు పట్టించుకోలేదు. దీంతో  మహిళలంతా కలిసి తిరువళ్లూరు-ఊత్తుకోట మార్గంలో రాస్తారోకో చేపట్టారు. దీని ఫలితంగా ఆ మార్గంలో ట్రాఫిక్ కు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. విషయం పోలీసుల వరకు చేరిందన్న సమాచారం తెలియడంతో వారికి దొరకకుండా ప్రభాకరన్ ముళ్లపొదల్లో దాక్కున్నాడు. అతడిని గాలించిన పోలీసులు ముళ్ళ పొదల్లో నుంచి అదుపులోకి తీసుకున్నారు. దీనిమీద విచారణ చేపట్టారు. ప్రభాకరన్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో..  మహిళలు ఆందోళన విరమించారు.

click me!