గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేయలేరా? ఇంటికి వచ్చి ఓటు సేకరించనున్న ఈసీ

By Mahesh KFirst Published Sep 27, 2022, 7:07 PM IST
Highlights

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేయలేకపోయే వారి కోసం ఎన్నికల సంఘం కీలక సదుపాయాన్ని ప్రకటించింది. అలాంటి వారి ఓటు సేకరించడానికి వారి ఇంటికి వెళతామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఇందుకోసం వారు ముందస్తుగా ఫామ్ 12 డీ నింపాల్సి ఉంటుంది.

అహ్మదాబాద్: ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ఓటు వేయలేని వారి కోసం ప్రత్యేక సదుపాయాన్ని తెలిపారు. అలాంటి వారి ఓటు సేకరించడానికి ఎన్నికల అధికారులే వారి ఇంటికి వెళతారని వెల్లడించారు. అయితే, ఇందుకోసం వారు 12డీ ఫామ్ నింపాల్సి ఉంటుంది. ఈ ఫామ్ నింపి పైన పేర్కొన్న సదుపాయాన్ని పొందవచ్చు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ కోసం కూడా ఇదే ఫామ్ నింపుతారనే విషయం తెలిసిందే.

ఈ ఏడాది డిసెంబర్‌లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఎన్నికల సన్నద్ధతను సమీక్షించడానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారుల ప్రతినిధుల బృందం గుజరాత్‌లో రెండు రోజుల పర్యటన చేస్తున్నారు. 

ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. పోల్ బూత్‌కు వెళ్లి ఓటు వేయలేకపోతున్న వారి ఓట్లను తాము స్వయంగా ఇంటికి వెళ్లి కలెక్ట్ చేస్తామని వివరించారు. ఈ పూర్తి ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీస్తామని తెలిపారు. అంతేకాదు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా అక్కడ హాజరు కావొచ్చని పేర్కొన్నారు.

CEC Sh Rajiv Kumar & EC Sh Anup Chandra Pandey holds meeting with enforcement agencies today to review poll preparedness for inducement free & smooth conduct of forthcoming assembly elections in . https://t.co/9pJaGkAp8I pic.twitter.com/kFs4gd3x07

— Election Commission of India #SVEEP (@ECISVEEP)

ఈ సారి తాము ప్రధానంగా వయోవృద్ధులు, వికలాంగులు, మహిళలు, తొలిసారి ఓటు వేయబోతున్నవారిపై ఫోకస్ పెడుతున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్క ఓటరు ఈ ప్రక్రియలో పాల్గొనడం అత్యవసరం అని వివరించారు.

అక్టోబర్ 10వ తేదీకల్లా తుది ఓటరు జాబితా వెలువడుతుంది. ఆ జాబితాలో ఎవరి పేర్లు అయినా రాకుంటే అధికారులను ఆశ్రయించవచ్చు. ఎన్నికల కోసం మొత్తం 51,782 పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. ఇందులో 50 శాతం వెబ్ క్యాస్టింగ్ సదుపాయాన్ని కలిగి ఉంటాయి. కంట్రోల్ రూమ్ నేరుగా పోలింగ్ స్టేషన్‌ల నుంచి వివరాలు లైవ్‌లో పొందుతుంది. 

click me!