మందుకొట్టే వాళ్లు అబద్ధాలాడరు.. టీకా తప్పనిసరి నిబంధనపై ఈ అధికారి లాజిక్‌కు నెటిజన్లు ఫిదా

By telugu teamFirst Published Nov 19, 2021, 8:20 PM IST
Highlights

మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాల్లో ఆల్కహాల్ కొనాలంటే రెండు డోసులు తీసుకుని ఉండాలనే నిబంధనను పెట్టారు. అయితే, వారు రెండు డోసులు వేసుకున్నట్టు టీకా సర్టిఫికేట్ చూపెట్టాల్సిన అవసరం లేదని జిల్లా అబ్కారీ అధికారి ఒకరు వివరించారు. మరి టీకా వేసుకున్నట్టు ఎలా ధ్రువీకరిస్తారని ప్రశ్నించగా.. మందుకొట్టేవారు అబద్ధాలాడరని, వారు రెండు డోసులు తీసుకున్నారా? లేదా? అని ప్రశ్నకు సమాధానం ఇస్తే చాలని సమాధానం ఇవ్వడం గమనార్హం. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
 

భోపాల్: కరోనా(Corona)పై పోరాటం ఇంకా కొనసాగుతున్న తరుణంలో విదేశీ ప్రయాణాలకు, ఇతర కొన్ని సదుపాయాలు పొందడానికి టీకా(Vaccine) వేసుకోవడం తప్పనిసరి అనే నిబంధన పెడుతున్నారు. టీకా పంపిణీ (Vaccination) వేగవంతం చేయడానికి, అలాగే, కరోనా వ్యాప్తిని అరికట్టే ఉద్దేశంతో ఈ నిబంధనలు పెడుతున్నారు. అయితే, టీకా వేసుకున్నారా? లేదా? అని ధ్రువీకరించడానికి టీకా సర్టిఫికేట్‌ను పరీక్షిస్తున్నారు. కానీ, మధ్య‌ప్రదేశ్‌కు చెందిన ఓ అధికారి టీకా వేసుకున్నారా? లేదా? అని ధ్రువీకరించడానికి టీకా సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదని పేర్కొన్నారు. అంతేకాదు, తనదైన లాజిక్‌ను ఒకటి బయటపెట్టి సంచలనానికి తెర తీశారు. మందుకొట్టే వాళ్లు అబద్ధాలు మాట్లాడరని, వారు టీకా సర్టిఫికేట్ చూపెట్టాల్సిన పని లేదని అన్నారు. కేవలం వారిని టీకా వేసుకున్నారా? లేదా? అని అడిగితే చాలనీ, వారే నిజాయితీగా ఆ విషయాన్ని చెప్పేస్తారని సెలవిచ్చారు.

మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో టీకా పంపిణీ వేగం పెంచడానికి సరికొత్త లక్ష్యాలను పెట్టుకుని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే లిక్కర్ షాపుల్లోనూ రెండు డోసుల టీకా వేసుకున్న వారికే ఆల్కహాల్ అమ్మాలనే నిబంధన పెట్టారు. ఆ షాపుల ముందు రెండు డోసులు వేసుకున్నవారికే ఆల్కహాల్ అమ్మబడుతుందనే బోర్డు పెట్టిస్తున్నారు. ఇదే విషయాన్ని ఖాండ్వా జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్‌పీ కిరార్ గురువారం విలేకరులకు తెలిపారు. అయితే, ఇవన్నీ బాగానే ఉన్నాయి గానీ, టీకా వేసుకున్నారా? లేదా? అని ఎలా గుర్తిస్తారని విలేకరుల అడిగారు. దీనికి ఆయన చెప్పిన సమాధానం నెట్టింట్లో వైరల్ అయింది. ఇది కేవలం వారి నిజాయితీ మీద ఆధారపడే ఉంటుందని ఆయన సమాధానం చెప్పారు. అంతేకాదు. ‘నా వ్యక్తిగత అనుభవం ప్రకారం, మందు కొట్టేవాళ్లు అబద్ధాలాడరు’(Do not Lie) అని సమాధానం తెలిపారు. వారు టీకా సర్టిఫికేట్‌ను చూపెట్టాల్సిన అవసరం లేదని వివరించారు. కస్టమర్లే వారు రెండు డోసుల టీకా వేసుకున్నారా? లేదా? చెప్పాల్సి ఉంటుందని అన్నారు.

Also Read: హనుమంతుడి కాళ్లు మొక్కి.. ముందున్న హుండీ కొట్టేసిన దొంగ.. వైరల్ అవుతున్న వీడియో ఇదే

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఓ యూజర్ సోషల్ మీడియాలో ఈ వీడియోకు కామెంట్ రాస్తూ.. ‘మీరు తాగుతారా? చెప్పండి. మిమ్మల్ని నమ్మేస్తాను.. ఎందుకంటే ఎవరు ఆల్కహాల్ తాగుతారో.. వారు కేవలం నిజాలే మాట్లాడుతారు కదా.. అబద్ధాలు చెప్పరు కదా’ అంటూ జోక్ చేశారు. మరొకరు ‘మందుకొట్టేవారు అబద్ధాలాడరు.. వాట్ ఏ లాజిక్’ అంటూ కామెంట్ చేశారు. ఇంకొకరు అంటే ఇది ‘లై డిటెక్టర్’లా పని చేస్తుందా? అంటూ రాసుకొచ్చాడు.

మధ్యప్రదేశ్‌లో 52 జిల్లాల్లో ఇప్పటి వరకు 7.88 కోట్ల డోసుల పంపిణీ పూర్తయింది. ఖాండ్వా జిల్లాలో సుమారు 13.86 లక్షల డోసులను అధికారులు పంపిణీ చేశారు.

click me!