
Bharat Jodo Yatra: మునుగోడు ఉపఎన్నిక.. పలు పార్టీల నేతల ఫిరాయింపులు, తాజాగా వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్యేల కొనుగులో వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. ఎమ్మెల్యేలకు డబ్బుల ఆశ చూపి.. ఫిరాయింపులకు ఉసిగొలుపుతున్న ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు, వయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్), భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లపై తీవ్ర విర్శలు గుప్పించారు. టీఆర్‌ఎస్, బీజేపీలు ఒకే నాణానికి రెండు ముఖాలనీ, అవి కలిసే పనిచేస్తున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా నడుచుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్, బీజేపీ రెండూ పార్టీలు నాయకులను కొనుగోలు చేస్తూ.. ప్రభుత్వాలను కూల్చేశాయని ఆరోపించారు.
‘‘మాకు బీజేపీ, టీఆర్‌ఎస్‌లు రెండు ఒకటే.. ఇద్దరూ ఒకే నాణేనికి రెండు ముఖాలు.. ఇద్దరూ కలిసి పనిచేస్తారు.. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. ఒకరికొకరు సాయపడతారు. ఢిల్లీలో బీజేపీకి టీఆర్‌ఎస్ సాయం చేస్తోందని ఇక్కడ స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు బీజేపీ సహకరిస్తోంది.రెండు పార్టీలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం, ధన రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఎమ్మెల్యేలను కొని డబ్బు రాజకీయాలు చేస్తున్నాయి.. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రెండు పార్టీలు పనిచేస్తున్నాయి" అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ చేపట్టిన దేశవ్యాప్త భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్ లపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులకు వందల కోట్ల ఆఫర్ చేసినట్టు ఘటన వెలుగులోకి రావడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ముఖ్యంగా ఎమ్మెల్యేలను డబ్బు, కాంట్రాక్టులతో ప్రలోభపెట్టి తమవైపునకు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని టీఆర్ఎస్ ఆరోపించింది. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు సమాచారం అందించడంతో సైబరాబాద్ పోలీసులు బుధవారం సాయంత్రం రంగారెడ్డిలోని ఫామ్‌హౌస్‌లో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అయితే ముగ్గురు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలన్న సైబరాబాద్ పోలీసుల అభ్యర్థనను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు తోసిపుచ్చింది. ఈ ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అంతేకాకుండా, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలను కేంద్రమంత్రి, బీజేపీ నేత జి కిషన్‌రెడ్డి కొట్టిపారేశారు. ఇది టీఆర్‌ఎస్‌లో భయాందోళనలకు గురిచేస్తోందనీ, సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇక నాలుగు రోజుల విరామం తర్వాత రాహుల్ గాంధీ తిరిగి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు. గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి 'భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. తెలంగాణలోని నారాయణపేట జిల్లా యెలిగండ్ల నుంచి రాహుల్ గాంధీ శుక్రవారం పాదయాత్రను ప్రారంభించారు. నేడు రాష్ట్రంలో మూడో రోజు యాత్ర కొనసాగుతోంది. ఈరోజు రాత్రికి మహబూబ్‌నగర్‌లో యాత్ర నిలిచిపోతుంది. సెప్టెంబరు 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర కాశ్మీర్ వరకు కొనసాగనుంది. ఇది దాదాపు 12 రాష్ట్రాలను కవర్ చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.