క్రైమ్ రౌండప్: జాలి కేసులో బయటకొస్తున్న వాస్తవాలు, సిమి ఉగ్రవాది అరెస్ట్.. మరిన్ని

By Siva Kodati  |  First Published Oct 13, 2019, 1:27 PM IST

కేరళలోని కోజికోడ్‌లో ఆస్తి కోసం సొంత కుటుంబసభ్యులనే చంపిన జాలీ కేసులో అనేక నివ్వెరపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతోందని పోలీసులు భావిస్తున్నారు. అదే సమయంలో సిమీ ఉగ్రవాది అజహరుద్దీన్ అలియాస్ కెమికల్ అలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా మరికొన్ని నేరవార్తలు.. 


కేరళలోని కోజికోడ్‌లో ఆస్తి కోసం సొంత కుటుంబసభ్యులనే చంపిన జాలీ కేసులో అనేక నివ్వెరపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతోందని పోలీసులు భావిస్తున్నారు. అదే సమయంలో సిమీ ఉగ్రవాది అజహరుద్దీన్ అలియాస్ కెమికల్ అలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా మరికొన్ని నేరవార్తలు.. 

జాలీ కేసులో కీలక విషయాలు:

Latest Videos

కోజికోడ్ సీరియల్ హత్య కేసులో చిక్కుముడులు విప్పడం పోలీసులకు కష్టంగా మారింది. 14 ఏళ్ల పాటు సాగిన ఈ నరమేథంలో ఆధారాల సేకరణ సవాలుతో కూడుకున్నదన్నారు కేరళ డీజీపీ లోక్‌నాథ్ బెహ్రా.

మొత్తం ఆరు కేసులను విడివిడిగా విచారించాల్సిన అవసరం ఉందన్నారు. దీనికి తోడు నిందితురాలు జాలికి స్ల్పిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉందని.. నిపుణులైన మానసిక వైద్యుల సాయం కావాల్సి వుందన్నారు.

మరోవైపు నిందితురాలికి ఆడపిల్లలంటే ద్వేషమని, దీనిలో భాగంగానే మరిన్ని హత్యలు చేసేందుకు కుట్ర పన్నినట్లుగా తేలింది. మరో ఇద్దరు చిన్నారులను సైతం చంపేందుకు ఆమె పథకం వేసినట్లు.. కోజికోడ్ రూరల్ ఎస్పీ తెలిపారు. ఈ విషయాలన్ని జాలినే స్వయంగా విచారణలో అంగీకరించినట్లు స్పష్టం చేశారు. 


పబ్‌జీ ఆడొద్దన్నందుకు: కిడ్నాప్ డ్రామా, ముంబై-హైదరాబాద్ మధ్య చక్కర్లు
ప్రభుత్వం, మానసిక వైద్యులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నా రోజు రోజుకి పబ్‌జీ భూతానికి బలవుతున్న విద్యార్ధుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ క్రమంలో పబ్‌జీ గేమ్ ముసుగులో ఓ ఇంటర్ విద్యార్ధి కిడ్నాప్ డ్రామా ఆడి పోలీసులను, తల్లిదండ్రులను ఉరుకులు పెట్టించాడు.

వివరాల్లోకి వెళితే హైదరాబాద్‌ పుప్పాలగూడ శ్రీరాంనగర్‌లో నివాసం ఉండే సమీర్ అర్మన్ నార్సింగిలోని జాహ్నవి జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సాయంత్రం సమయంలో షేక్‌పేట్‌లోని ఆకాశ్‌లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సు చేస్తున్నాడు.

ఇతని తండ్రి ఆస్ట్రేలియాలో హోటల్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అయితే సమీర్‌కు వీడియో గేమ్‌ల పిచ్చి వుంది. గత కొంతకాలంగా అతను మొబైల్‌లో పబ్‌జీ గేమ్ ఆడుతూ చదవును నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీనిని గమనించి ఫోన్ లాక్కొని మందలించింది.

దీంతో తీవ్రమనస్తాపానికి గురైన సమీర్ శుక్రవారం మణికొండలో ఉంటున్న స్నేహితుడు సిద్ధార్ధ వద్దకు వెళ్లి అటు నుంచి కాలేజీకి వెళతానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఏటీఎం నుంచి నగదు తీసుకుని రాత్రి 9.30 గంటలకు ఇమ్లీబన్ బస్‌స్టేషన్ నుంచి ముంబై బయలుదేరాడు.

ఈ క్రమంలో తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో వాష్‌రూంకు వెళ్లేందుకు దిగాడు. అయితే అతను తిరిగి వచ్చేలోపు బస్సు వెళ్లిపోవడంతో ఏం చేయాలో పాలుపోలేదు. వెంటనే అక్కడే వున్న తోటి ప్రయాణికుల ఫోన్ తీసుకుని ఉదయం 7 గంటలకు తల్లికి ఫోన్ చేశాడు.

మీ అబ్బాయిని కిడ్నాప్ చేశామని, మూడు లక్షల రూపాయలు పంపాలని డిమాండ్ చేశాడు. అయితే ఆమె ఈ విషయంగా పెద్దగా స్పందించలేదు. శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ తిరిగి చేరుకుని సాయంత్రం 6 గంటలకు మాచర్లలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లేందుకు ఆన్‌లైన్లో బస్సు టికెట్ బుక్ చేసుకున్నాడు.

బుకింగ్ కన్ఫర్మేషన్ మేసేజ్ ఇంట్లో ఉన్న ఫోన్‌కు రావడంతో తల్లి చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాచర్లకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న బస్సులో కూర్చొన్న సమీర్‌ను రాయదుర్గం పోలీసులు పట్టుకుని తల్లికి అప్పగించారు. 


ఐటీ అధికారుల విచారణ: మాజీ ఉపముఖ్యమంత్రి పీఏ ఆత్మహత్య

కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి పరమేశ్వర పీఏ రమేశ్ ఆత్మహత్యకు పాల్పడటం కన్నడ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. గత మూడు రోజులుగా ఐటీ శాఖ అధికారులు పరమేశ్వర ఇళ్లు, కార్యాలయాలు, విద్యాసంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

దీనిలో భాగంగా పరమేశ్వర సన్నిహితుడు, పీఏ రమేశ్ ఇంట్లో సైతం తనిఖీలు నిర్వహించారు. దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన రమేశ్ బెంగళూరులోని జ్ఞాన భారతి విశ్వవిద్యాలయం ఆవరణలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

బలవన్మరణానికి పాల్పడటానికి ముందు తన ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి ‘‘తాను పేదవాడినని, తనపై ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టింది. తన ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నానని, ఎంతో బతికానని.. ఐటీ అధికారుల విచారణను ఎదుర్కొనే శక్తి తనకు లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.

అంతకు ముందు సోదాల్లో భాగంగా ఐటీ శాఖ అధికారులు రమేశ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి.. శనివారం ఉదయం విడిచిపెట్టారు. రామనగర జిల్లా మల్లేహళ్లికి చెందిన రమేశ్ కేపీసీసీలో టైపిస్టుగా పనిచేశాడు. అనంతరం పరమేశ్వర పీఏగా చేరాడు. 

 

రివెంజింగ్ రోమాన్స్ : భార్య నాలుకపై ముద్దుపెడుతూ..కోసేసిన భర్త

గుజరాత్‌లో దారుణం జరిగింది. భార్యతో రోమాన్స్ చేసినట్లుగానే చేసి.. క్షణాల్లో ఆమె నాలుకను కోసేశాడో భర్త. వివరాల్లోకి వెళితే.. అహ్మాదాబాద్ నగరంలోని జుహాపురా ప్రాంతానికి చెందిన ఓ 36 ఏళ్ల వివాహిత స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది.

ఆమెకు 2004లో డరియాపూర్‌కు చెందిన వ్యక్తితో వివాహమైంది... అయితే ఐదేళ్లలోనే భేదాభిప్రాయాలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. కొద్దికాలం ఒంటరిగానే జీవించిన ఆమె 2018 మార్చి 24న జుహాపురాకు చెందిన వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది.

అతనికి గతంలోనే రెండు పెళ్లిళ్లు జరిగినట్లుగా సమాచారం. ఈ క్రమంలో తన భర్త, అతని రెంబో భార్య, కొడుకుతో ఇప్పటికీ సంబంధాలు కొనసాగిస్తున్నాడని బాధితురాలు తెలుసుకుని అభ్యంతరం తెలిపింది. దీంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవ జరిగేది.

ఇదే సమయంలో కుటుంబపోషణ భారంగా ఉండటంతో ఏదైనా ఉద్యోగం కానీ వ్యాపారం కాని ప్రారంభించాలని భర్తపై ఒత్తిడి తీసుకొచ్చేది. దీంతో ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు.

ఈ క్రమంలో గత వారం తనకు డబ్బు ఇవ్వలేదన్న కోపంతో అతడు.. భార్యను చితక్కొట్టాడు. కాగా.. బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో నిద్రిస్తున్న ఆమెతో ఏకాంతంగా గడుపుతున్నట్లు నటించాడు. తనకు నాలుకపై ముద్దు పెట్టుకోవాలని తెలిపాడు.

భర్త కోరికను కాదనలేకపోయిన ఆమె నాలుకను బయటకు చాపింది. అంతే రెప్పపాటులో పదునైన కత్తితో ఆమె నాలుకను కోసేశాడు. అంతేకాకుండా భార్యను గదిలో పెట్టి తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు.

ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆమె తన సోదరికి వీడియో కాల్ చేసి పరిస్ధితిని తెలియజేసింది. దీంతో ఆమె సోదరి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని.. పొరుగింటి వారి సాయంతో బాధితురాలని ఎస్‌వీపీ ఆసుపత్రికి తరలించింది.

వైద్యులు అతికష్టం మీద శస్త్రచికిత్స తీసి నాలుకను యథాస్థానంలో ఉంచారు. జరిగిన సంఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

మోస్ట్ వాంటెడ్ టెర్టరిస్ట్ అరెస్ట్:

అనుమానిత సిమీ ఉగ్రవాది అజహరుద్దీన్ అలియాస్ కెమికల్ అలీని హైదరాబాదులో శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. 2013లో జరిగిన బుద్ధగయ, పాట్నా బాంబు పేలుళ్ల సంఘటనలతో అతనికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

కెమికల్ అలీని హైదరాబాదులోని శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం చత్తీస్ గఢ్ పోలీసులు అరెస్టు చేశారు సౌదీ అరేబియా నుంచి వచ్చిన అతన్ని అరెస్టు చేసినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. హైదరాబాదులోని బంధువుల ఇంటికి రావడానికి విమానాశ్రయంలో దిగినట్లు చెబుతున్నారు. 

అజహరుద్దీన్ అలియాస్ కెమికల్ అలీ రాయపూర్ లోని మౌధాపరాకు చెందినవాడు. గత ఆరేళ్లుగా అతను సౌదీ అరేబియాలో తలదాచుకుంటున్నాడు. సౌదీ అరేబియాలోని ఓ సూపర్ మార్కెట్లో అతను సేల్స్ మన్ గానూ డ్రైవర్ గానూ పనిచేస్తూ వచ్చాడు.

ఆ విషయాన్ని సీనియర్ పోలీసు సూపరింటిండెంట్ ఆరిఫ్ షేక్ రాయపూర్ లో మీడియా ప్రతినిధులకు చెప్పారు. తమకు అందిన సమాచారం మేరకు చత్తీస్ గర్ పోలీసులు, ఉగ్రవాద నిరోధ దళం సభ్యులు సంయుక్తంగా అతన్ని పట్టుకున్నారు.

హైదరాబాదులో అరెస్టు చేసిన అతన్ని చత్తీస్ గఢ్ కు తీసుకుని వెళ్లారు. కెమికల్ అలీ స్లీపర్ సెల్ గా పనిచేశాడని చెబుతున్నారు. బుద్ధగయ, పాట్నా బాంబు పేలుళ్లకు పాల్పడినవారికి అతను ఆశ్రయం కల్పించాడని పోలీసులు అంటున్నారు. 

అతని నుంచి పాస్ పోర్టు, రెండు డ్రైవింగ్ లైసెన్సులు, ఓ వోటింగ్ పాస్, ఓ వోటర్ ఐడెంటిటీ కార్డు స్వాధీనం చేసుకున్నారు. బుద్ధగయ, పాట్నా బాంబు పేలుళ్ల కేసుల్లో పోలీసులు 17 మందిని అరెస్టు చేశారు.

అయితే, అజహరుద్దీన్ మాత్రం అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు.హైదరాబాదుకు వస్తున్నట్లు సమాచారం అందుకుని పోలీసులు శుక్రవారం అతన్ని అరెస్టు చేశారు.

click me!