ఐటీ అధికారుల విచారణ: మాజీ ఉపముఖ్యమంత్రి పీఏ ఆత్మహత్య

By Siva KodatiFirst Published Oct 13, 2019, 12:03 PM IST
Highlights

కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి పరమేశ్వర పీఏ రమేశ్ ఆత్మహత్యకు పాల్పడటం కన్నడ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. గత మూడు రోజులుగా ఐటీ శాఖ అధికారులు పరమేశ్వర ఇళ్లు, కార్యాలయాలు, విద్యాసంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు

కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి పరమేశ్వర పీఏ రమేశ్ ఆత్మహత్యకు పాల్పడటం కన్నడ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. గత మూడు రోజులుగా ఐటీ శాఖ అధికారులు పరమేశ్వర ఇళ్లు, కార్యాలయాలు, విద్యాసంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

దీనిలో భాగంగా పరమేశ్వర సన్నిహితుడు, పీఏ రమేశ్ ఇంట్లో సైతం తనిఖీలు నిర్వహించారు. దీనిపై తీవ్ర మనస్తాపానికి గురైన రమేశ్ బెంగళూరులోని జ్ఞాన భారతి విశ్వవిద్యాలయం ఆవరణలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

బలవన్మరణానికి పాల్పడటానికి ముందు తన ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి ‘‘తాను పేదవాడినని, తనపై ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టింది. తన ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నానని, ఎంతో బతికానని.. ఐటీ అధికారుల విచారణను ఎదుర్కొనే శక్తి తనకు లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.

అంతకు ముందు సోదాల్లో భాగంగా ఐటీ శాఖ అధికారులు రమేశ్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి.. శనివారం ఉదయం విడిచిపెట్టారు. రామనగర జిల్లా మల్లేహళ్లికి చెందిన రమేశ్ కేపీసీసీలో టైపిస్టుగా పనిచేశాడు. అనంతరం పరమేశ్వర పీఏగా చేరాడు. 

click me!