
లక్నో: కొందరు దొంగలు ఆలయం నుంచి విగ్రహాలు దొంగిలించారు. ఎంతో విలువైన అష్టలోహ విగ్రహాలను కూడా చోరీ చేశారు. సుమారు వారం రోజుల తర్వాత ఆ విగ్రహాలన్నింటినీ ఓ సంచిలో పెట్టి ఆ ఆలయ పూజారి ఇంటి ముందు పెట్టి వెళ్లిపోయారు. అంతేకాదు, అందులో ఓ లేఖ కూడా పెట్టారు. ఈ ఆలయ విగ్రహాలు చోరీ చేసినప్పటి నుంచి తమను భయంకర కలలు వెంటాడుతున్నాయని వారు పేర్కొన్నారు. అందుకే ఈ విగ్రహాలను మళ్లీ వెనక్కి ఇచ్చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు, దయచేసి ఆ విగ్రహాలను మళ్లీ అక్కడే పెట్టాలని అర్థించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
చిత్రకూట్‌లోని బాలాజీ టెంపుల్‌లో ఈ ఘటన జరిగింది. తరౌహా పట్టణం జై దేవదాస్ అఖాడా లోపల నిర్మించిన బాలాజీ టెంపుల్‌లో పురోహితుడిగా మహంత్ రామ్ బాలక్ దాస్ ఉన్నాడు. మే 9వ తేదీ ఉదయం మహంత్ రామ్ బాలక్ దాస్ సతీమణి ఆలయానికి వెళ్లారు. కానీ, ఆలయంలో దేవుళ్ల విగ్రహాలు కనిపించలేవు. ఐదు కిలోల అష్టలోహ రాముడి విగ్రహం సహా 16 విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఇవి లక్షల విలువైనవి.
దీంతో మహంత్ రామ్ బాలక్ దాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కూడా ప్రారంభించారు. అయితే, ఈ కేసులో అనూహ్య మలుపు వచ్చింది.
ఈ విగ్రహాలను చోరీ చేసిన వారం తర్వాత దొంగలు వాటిని తిరిగి వెనక్కి తెచ్చారు. మహావీర్ నగర్‌లోని మహంత్ రామ్ బాలక్ దాస్ ఇంటి ముందు ఆ విగ్రహాలను ఓ సంచిలో పెట్టి ఉంచారు. మహంత్ రామ్ బాలక్ దాస్ ఆ సంచిని చూశాడు. ఆ విగ్రహాలను తీశాడు. అయితే, వాటితోపాటు ఓ లేఖ కనిపించింది. ఆ లేఖలో వారు పురోహితుడికి దొంగలు విజ్ఞప్తి చేశారు. వారిని భయంకరమైన కలలు వేధిస్తున్నాయని, ఈ విగ్రహాలు చోరీ అయినప్పటి నుంచి వెంటాడుతున్నాయని దొంగలు పేర్కొన్నారు. అందుకే వారు విగ్రహాలను వెనక్కి ఇస్తున్నట్టు తెలిపారు. దయచేసి ఆ విగ్రహాలను ఆలయంలో పున:ప్రతిష్టించాలని కోరారు.