రైల్లో పారిపోయిన దొంగ.. పట్టుకోవడానికి విమానంలో వెళ్లిన పోలీసులు

By telugu news teamFirst Published Oct 21, 2020, 3:57 PM IST
Highlights

ఇంట్లోని ఎలక్ట్రిక్ లాకరులో ఉన్న 1.3 కోట్ల రూపాయల బంగారు ఆభరణాలను దోచుకొని పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హౌరాకు వెళ్లే రైలు ఎక్కాడు.

ఓ ఇంట్లో భారీ దొంగతనం చేసి రైళ్లో పారిపోతున్న దొంగని పట్టుకోవడానికి  పోలీసులు విమానంలో వెళ్లారు. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బుర్ద్వాన్ నగరానికి చెందిన ఓ వ్యక్తి  బెంగళూరులోని ఒక బిల్డరు ఇంట్లో పని చేసేవాడు. తన యజమాని కుటుంబసభ్యుల్లో ఒకరు కరోనా వైరస్ బారిన పడ్డారు. 

ఇదే అదనుగా తీసుకున్న పనివాడు ఇంట్లోని ఎలక్ట్రిక్ లాకరులో ఉన్న 1.3 కోట్ల రూపాయల బంగారు ఆభరణాలను దోచుకొని పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హౌరాకు వెళ్లే రైలు ఎక్కాడు. బిల్డరు ఫిర్యాదు మేర కేసు నమోదు చేసుకున్న పోలీసులు యశ్వంత్ పూర్ రైల్వేస్టేషనులో సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా నిందితుడు హౌరా వెళ్లే రైలు ఎక్కాడని తేలింది. 

దొంగ 1.3కోట్ల విలువైన చోరీ సొత్తుతో రైలులో ప్రయాణిస్తుండగా బెంగళూరు పోలీసులు అతన్ని పట్టుకునేందుకు విమానంలో అతనికంటే ముందే కోల్ కతాకు చేరుకున్నారు. రైలు కోల్ కతా రైల్వేస్టేషనుకు రాగానే కాపు కాసిన బెంగళూరు పోలీసులు దొంగను పట్టుకున్నారు. విలువైన ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్టు చేశారు.  

click me!