జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కరడుగట్టిన టెర్రరిస్టు తండ్రి

By telugu teamFirst Published Aug 15, 2021, 2:17 PM IST
Highlights

హిజ్బుల్ ముజాహిదీన్‌కు పోస్టర్ బాయ్‌గా పేరొందిన, యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడంలో కీలకంగా వ్యవహరించిన బుర్హన్ వనీ తండ్రి ముజఫర్ వనీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఓ ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 2016లో ఓ ఎన్‌కౌంటర్‌లో బుర్హన్ వనీ మరణించినప్పుడు కాశ్మీర్ లోయ అట్టుడికింది. కొన్ని నెలలపాటు యువత అరాచకం సృష్టించింది.

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో 2016లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన కరడుగట్టిన టెర్రరిస్టు బుర్హన్ వనీ తండ్రి ముజఫర్ వనీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పుల్వామాలో త్రాల్‌లోని ఓ పాఠశాలలో ఆయన జెండా ఎగరేశారు.

15ఏళ్లకే బుర్హన్ వనీ హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరాడు. తనకు 21ఏళ్లు వచ్చాక 2016లో పుల్వామాలోని ఓ ఎన్‌కౌంటర్‌లో బలగాల చేతిలో హతమయ్యాడు. తన అన్నయ్యను పోలీసులు అకారణంగా హింసించారన్న కోపంతో బుర్హన్ వనీ ఉగ్రవాదంలోకి చేరినట్టుగా చెబుతారు. ఆయన హిజ్బుల్‌లో చేరిన తర్వాత కశ్మీర్ యువత ఎక్కువగా ఉగ్రవాదంవైపు ఆకర్షితమైంది. బుర్హన్ వనీ టెక్నాలజీ నైపుణ్యాలున్నవాడు. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండేవాడు. తన ఫొటోలు, గన్నులు, ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ యువతను ఉత్తేజితం చేస్తుండేవాడు. అందుకే బుర్హన్ వనీని ముజాహిదీన్ పోస్టర్ బాయ్‌గా పేర్కొనేవారు. ఆయన చేరిన తర్వాత హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ సోషల్ మీడియా, ఇంటర్నెట్ వినియోగించి యువతను ఉగ్రవాదంవైపు మళ్లించడం పెరిగింది. అప్పట్లో వనీపై రూ. పది లక్షల క్యాష్ రివార్డును ప్రభుత్వం ప్రకటించింది.

బుర్హన్ వనీకి యువతో మాంచి క్రేజ్ వచ్చింది. 2016లో ఆయన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాక శ్రీనగర్‌లో ప్రజలు పెద్దమొత్తంలో వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేశారు. టైర్లు కాలబెడుతూ రెచ్చిపోవడంతో ప్రభుత్వం కర్ఫ్యూలాంటి ఆంక్షలు విధించాల్సి వచ్చింది. అనంతరం కొన్ని నెలలపాటు లోయలో యువత ఆందోళనలు, అల్లర్లు చేశారు.  

బుర్హన్ వనీ తండ్రి ముజఫర్ వనీ త్రాల్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా విద్యా శాఖ సహా అన్ని ప్రభుత్వ శాఖలు స్వాతంత్ర్య దినోత్సవాన జెండా ఎగరేయాలని కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలు జారీ చేసింది. అన్ని పాఠశాలల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతాయని, సీఈవో, ప్రిన్సిపాల్స్, హెడ్‌మాస్టర్లకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వ ఆదేశం పేర్కొంది. అయినప్పటికీ చాలా స్కూళ్లు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించలేదని తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే ముజఫర్ వనీ జాతీయ జెండాను ఎగరేయడం గమనార్హం.

ముజఫర్ వనీ జెండా ఎగరేయబోడని, అందుకు బదులు ఉద్యోగానికి రాజీనామా చేయబోతున్నాడన్న వదంతులు వచ్చాయి. వాటిని ముజఫర్ వనీ స్వయంగా ఓ వీడియో స్టేట్‌మెంట్‌లో ఖండించాడు. తాను జెండా ఆవిష్కరించబోతున్నాడని, అందుకు తనకు ప్రత్యేకంగా ఆదేశాలేవీ రాలేవని స్పష్టం చేశారు. తనపై వదంతులు సృష్టించేవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. తాజాగా, ఆయన పనిచేసే పాఠశాలలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

click me!