
న్యూఢిల్లీ: హర్యానాలో ఓ దొంగ భక్తుడి లీలలు సీసీటీవీ ద్వారా బయటపడ్డాయి. ఓ దొంగ భక్తుడు అందరిలాగే గుడిలోకి వెళ్లాడు. గర్భ గుడిలోకి వెళ్లి దేవుడికి మొక్కాడు. రూ. 10 హనుమంతుడి పాదాల దగ్గర పెట్టాడు. వేరే భక్తులూ వస్తున్న సమయంలో ఆ దొంగ భక్తుడు అక్కడే కూర్చొని హనుమాన్ చాలీసా చదవడం మొదలు పెట్టాడు. సుమారు పది నిమిషాల పాటు హనుమాన్ చాలీసా చదివాడు. భక్తులు రావడం తగ్గిపోయాక.. పూజారీ కూడా ఆ దొంగ భక్తుడిని నమ్మి అక్కడి నుంచి బయటకు వెళ్లగానే అతడు తన చేతివాటం చూపించాడు.
ఎవరూ లేనిది చూసి ఆ దొంగ భక్తుడు వెంటనే గుడిలోని హుండీని పగులగొట్టాడు. అందులోని డబ్బును బయటకు తీసి పరారయ్యాడు. రూ. 10 సమర్పించి రూ. 5,000 పట్టుకెళ్లాడు. ఈ ఘటన హర్యానాలోని రెవారీ జిల్లాలో చోటుచేసుకుంది. ధరుహెరా పట్టణంలోని హనుమంతుడి ఆలయంలో ఈ చోరీ జరగ్గా.. అదంతా గుడిలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
అయితే, చోరీ జరిగిన విషయాన్ని ఆ గుడి పూజారీ పసిగట్టలేదు. ప్రతి రోజులాగే.. ఆ రోజు సాయంత్రమూ గుడికి తాళం వేసి వెళ్లిపోయాడు . మరుసటి రోజు ఉదయం గుడికి వచ్చి తాళం తీయగా.. హుండీ పగిలి ఉన్న విషయాన్ని పసిగట్టాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ దొంగ భక్తుడి కోసం వేట ప్రారంభించారు.