'చదివింపుల విందు'... కానుకలుగా రూ.15 కోట్లు , ఎక్కడో తెలుసా..?

By Siva KodatiFirst Published Aug 19, 2022, 8:11 PM IST
Highlights

తమిళనాడులో మాత్రం కేవలం చదివింపుల కోసం విందు ఏర్పాటు చేస్తూంటారు. దీని ద్వారా వచ్చిన సొత్తును మంచి కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. పుదుక్కోట్టై జిల్లా నెడువాసల్‌ కిళక్కు గ్రామంలో మంగళవారం నిర్వహించిన చదివింపుల విందు కార్యక్రమానికి రూ.15 కోట్ల వరకు వసూలైందట.
 

పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల సందర్భంగా చదివింపులు చదివించడం మన దగ్గర ఎప్పటి నుంచో వస్తున్నదే. అయితే తమిళనాడులో మాత్రం కేవలం చదివింపుల కోసం విందు ఏర్పాటు చేస్తూంటారు. దీని ద్వారా వచ్చిన సొత్తును మంచి కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. తాజాగా పుదుక్కోట్టై జిల్లాలో జరిగిన చదివింపుల విందు కార్యక్రమంలో ఏకంగా రూ.15 కోట్ల నగదు పోగైంది. తంజావూరు , పుదుక్కోట్టై, మధురై జిల్లాల సరిహద్దు గ్రామాల్లో జరిగే ఈ చదివింపుల విందు వల్ల ఎంతోమందికి ఉపాధితో పాటు ప్రజల మధ్య అనుబంధాన్ని కూడా పెంచుతోంది. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో ఈ విందు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీని ద్వారా వసూలయ్యే కోట్లాది రూపాయల నగదును గ్రామాభివృద్ధి కార్యక్రమాలకు, నిరుపేదలను ఆదుకునేందుకు, పేదల పెళ్లిళ్లు, చదువులకు సాయంగా అందిస్తారు. 

ఎన్నో ఏళ్ల నుంచి నిరాటంకంగా జరుగుతూ వస్తోన్న ఈ చదివింపుల విందు కార్యక్రమం గడిచిన రెండేళ్లేగా కోవిడ్ వల్ల ఆగిపోయింది. అయితే ప్రస్తుతం పరిస్ధితులు చక్కబడటంతో తమిళనాడు గ్రామాల్లో చదివింపుల విందులు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో పుదుక్కోట్టై జిల్లా నెడువాసల్‌ కిళక్కు గ్రామంలో మంగళవారం నిర్వహించిన చదివింపుల విందు కార్యక్రమానికి గ్రామస్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. కడుపునిండా భోజనం చేసి.. తమకు తోచిన మొత్తాన్ని చదివింపులుగా వేశారు. అనంతరం బుధవారం నిర్వాహకులు లెక్కింపు కార్యక్రమం చేపట్టగా.. ఏకంగా రూ.15 కోట్ల వరకు వసూలైందట. 

కరోనాకు ముందు 2019లో ఓ వ్యక్తి మాంసాహారంతో చదివింపుల విందు ఏర్పాటు చేయగా.. అప్పట్లో రూ.4 కోట్లు పోగయ్యాయి. తన ఆర్ధిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఆయన ఏర్పాటు చేసిన విందు వల్ల సమస్యలన్నీ పరిష్కారమై కోటీశ్వరుడయ్యారు. ఇదే పుదుక్కోట్టై జిల్లా కీరామంగళం తాలుకాలోని వడగాడు గ్రామానికి చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి కూడా తన సమస్యల నుంచి బయటపడేందుకు తన గ్రామంతో పాటు సమీప గ్రామాల్లోని దాదాపు 50 వేల మందిని చదివింపుల విందుకు ఆహ్వానించాడు. దీనికి భారీగా హాజరైన ప్రజలు.. ఆయనను సమస్యల నుంచి గట్టెక్కించేంత మొత్తాన్ని సమర్పించారు. 

click me!