
న్యూఢిల్లీ: రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేయడంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన తరుణంలో భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేయడం సబబేనా? అనే చర్చ మొదలైంది. ఒక వైపు ఈ చర్చ జరుగుతుండగానే భారత్‌కు చెందిన అతిపెద్ద ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ రష్యాతో చమురు ఒప్పందం కుదుర్చున్నట్టు కథనాలు వచ్చాయి. ముడి చమురు ఒక బ్యారెల్ ధర 100 అమెరికన్ డాలర్లు దాటుతున్న తరుణంలో చౌకగా ఆయిల్ లభిస్తున్నప్పుడు భారత్ వంటి దేశాలు మొగ్గు చూపడంలో తప్పేమీ లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
కాగా, చట్టబద్ధంగా భారత ఆయిల్ కంపెనీలు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడాన్ని ఏ దేశమూ రాజకీయం చేయరాదని స్పష్టం చేసింది. రష్యా నుంచి భారత్ చౌకగా చమురు దిగుమతి చేసుకునే ఏర్పాట్లలో ఉన్నదని కథనాలు రాగానే అమెరికా స్పందించింది. రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడం రష్యాపై విధించిన ఆంక్షలను ఉల్లంఘించినట్టు కాదని తెలిపింది. కానీ, రష్యా నుంచి భారత్ ఈ సమయంలో చమురు కొనుగోలు చేస్తే మాత్రం ఉక్రెయిన్ పై దాని దురాక్రమణను సమర్థించినట్టే అవుతుందని వివరించింది. కాబట్టి, చరిత్రలో భారత్ ఎటువైపు నిలబడాలో నిర్ణయించుకోవాలని సూచించింది.
అయితే, భారత్ మాత్రమే కాదు.. ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలు చాలానే ఉన్నాయి. వాటి జాబితాను చూస్తే ఇలా ఉన్నది.
బల్గేరియా దేశం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నది. బాల్కన్ దేశాల్లో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ నెఫ్టోకిమ్ రష్యాకు చెందిన లుకోయిల్‌దే. ఇప్పటికీ ఈ కంపెనీ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నది.
రష్యా నుంచి రెండో అతిపెద్ద చమురు దిగుమతిదారు చైనా కూడా ఇప్పటికీ కొనుగోలు చేస్తున్నది. అంతేకాదు, గతంలో కంటే రష్యా నుంచి షిప్‌మెంట్ ఇంకా పెరిగినట్టు కనిపిస్తున్నదని సముద్ర మార్గంలో షిప్‌మెంట్‌ను ట్రాక్ చేసే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వెల్లడించింది.
27 దేశాల సభ్యత్వం ఉన్న యూరోపియన్ యూనియన్ 40 శాతం సహజవాయువు దిగుమతులు, 27 శాతం క్రూడాయిల్ దిగుమతులకు రష్యాపైనే ఆధారపడి ఉంటాయి. అయితే, ఈ దిగుమతులపై ఆంక్షలు విధించడంపై ఈ సమాఖ్యలోని దేశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శిలాజ ఇంధనాలపై దీర్ఘకాల నిషేధంపై ప్రణాళికలు మే నెల చివర నుంచి అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రష్యా ప్రధాన చమురు కంపెనీలు రోస్నెఫ్ట్, ట్రాన్స్‌నెఫ్ట్, గాజ్‌ప్రోమ్ నెఫ్ట్‌లపై ఆంక్షలకు సిద్ధం అవుతున్నాయి. కానీ, దిగుమతులను మాత్రం కొనసాగించనున్నాయి.
వీటితోపాటు కొద్ది మొత్తంలో ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇండయా, ఇటలీ, హంగరీ, నెదర్లాండ్స్, పోలాండ్, టర్కీలూ ఇప్పటికీ రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేస్తున్నాయి.