కొడుకు పుట్టాడని మొక్కు చెల్లించేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు..విమాన ప్రమాదంలో మరణించిన యూపీ వాసి కథ విషాదం

By team teluguFirst Published Jan 16, 2023, 11:19 AM IST
Highlights

కుమారుడు జన్మిస్తే నేపాల్ లోని పశుపతినాథ్ ఆలయాన్ని దర్శిస్తానని ఆ యూపీ వాసి మొక్కుకున్నాడు. అనుకున్నట్టుగానే కుమారుడు జన్మించాడు. దీంతో సంతోషంతో మొక్కు చెల్లించేందుకు నేపాల్ కు వెళ్లాడు. కానీ అక్కడ జరిగిన విమాన ప్రమాదంలో మరణించాడు. దీంతో అతడి గ్రామంలో విషాదం నెలకొంది. 

నేపాల్ లో జరిగిన విమాన ప్రమాదంలో 72 మంది దుర్మరణం చెందారు. ఇందులో భారతదేశానికి చెందిన ఐదుగురు కూడా ఉన్నారు. ఇందులో యూపీకి చెందిన జైస్వాల్ అనే వ్యక్తి ఉన్నారు. కుమారుడు జన్మించాడని ఆయన ఖట్మాండులోని పశుపతినాథ్ ఆలయానికి మొక్కు చెల్లించేందుకు వెళ్లారు. కానీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ వార్త ఆయన గ్రామంలో విషాదం నింపింది. 

ఘాజీపూర్ జిల్లాలోని చక్ జైనాబ్  గ్రామంలో నివసించే సోనూ జైస్వాల్ (35) కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే తనకు కుమారుడు జన్మిస్తే పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శిస్తానని ఆయన మొక్కుకున్నారు. జైస్వాల్ అనుకున్నట్టుగానే ఆరు నెలల కిందట కుమారుడు జన్మించాడు. దీంతో మొక్కును తీర్చుకునేందుకు ఆయన మరో ముగ్గురు స్నేహితులతో కలిసి పశుపతినాథ్ ఆలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారని 
చక్ జైనాబ్ గ్రామ అధిపతి విజయ్ జైస్వాల్ వార్తా సంస్థ ‘పీటీఐ’తో తెలిపారు. 

‘‘సోను, తన ముగ్గురు స్నేహితులతో కలిసి జనవరి 10న నేపాల్‌కు వెళ్లాడు. ఇప్పుడు ఆయన కుమారుడికి ఆరు నెలల వయస్సు ఉంది. తన కోరిక నెరవేరినందుకు, మొక్కును తీర్చుకునేందుకు ఉద్దేశంతో పశునాథుడిని దర్శించుకోవాలని వెళ్లారు. కానీ విధి వేరేలా ఉంది. ’’ అని విజయ్ జైస్వాల్ ఉద్వేగభరితంగా చెప్పారు. 

సోనూ జైస్వాల్ ఘాజీపూర్ జిల్లాలో బీరు దుకాణం నడుపుతున్నారు. వీరికి అలవల్‌పూర్ చట్టిలో మరో ఇల్లు ఉంది. కానీ ప్రస్తుతం ఆయన భార్య పిల్లలతో కలిసి వారణాసిలోని సారనాథ్‌లో నివసిస్తున్నారు. సోనూ జైస్వాల్ తో కలిసి విమానంలో ప్రయాణించిన మరో ముగ్గురు స్నేహితులైన అభిషేక్ కుష్వాహ (25), విశాల్ శర్మ (22), అనిల్ కుమార్ రాజ్‌భర్ (27) కూడా ఈ ప్రమాదంలో మరణించారు. ఈ ఘటనపై సమాచారం తెలియడంతో గ్రామం మొత్తం విషాదంతో నిండిపోయింది. గ్రామస్తులు అంతా సోనూ ఇంటికి చేరుకున్నారు. ఆయన బాగుండాలని ప్రార్థించారు. తరువాత ఈ విషాదకరమైన విషయం జిల్లా అధికార యంత్రాంగానికి తెలిసింది. 

ఈ నలుగురు స్నేహితులు నేపాల్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పోఖారాలో పారాగ్లైడింగ్‌ని ఆస్వాదించిన తరువాత మంగళవారం ఘాజీపూర్‌కు చేరుకోవాల్సి ఉందని గ్రామస్తులు తెలిపారు. వీరు పోఖారాకు వెళ్లే ముందు పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకున్న తరువాత సమీపంలోని ఆవుల షెడ్‌లో తరువాత తామెల్‌లోని హోటల్ ‘డిస్కవరీ ఇన్’’లో బస చేశారని నేపాల్ అధికారులు చెప్పారు. అయితే వీరంతా పోఖారా నుంచి గోరఖ్‌పూర్ మీదుగా భారత్‌కు తిరిగి రావాలని ప్లాన్ చేసుకున్నారు. 

కాగా.. సోనూ జైస్వాల్ తో వెళ్లిన అనిల్ కుమార్ రాజ్‌భర్ కంప్యూటర్ వ్యాపారం చేస్తూ ‘జన్ సేవా కేంద్రం’ నిర్వహిస్తున్నారు. అభిషేక్ కూడా కంప్యూటర్ వ్యాపారం చేస్తున్నారు. విశాల్ శర్మ టూవీలర్ కంపెనీలో ఆపరేటర్ గా పని చేస్తున్నారు. ఈ విమాన ప్రమాదంలో యూపీకి చెందిన నలుగురు స్నేహితులు కాకుండా  సంజయ్ జైస్వాల్ అనే మరో భారతీయుడు కూడా మరణించాడని యెతి ఎయిర్‌లైన్స్ పేర్కొంది. ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన సమాచారం లేదని తెలిపింది. 

ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదం చాలా బాధాకరమని పేర్కొన్నారు. ‘‘ భారతీయ పౌరులతో పాటు ఈ ఘటనలో మరణించిన వారందరికీ వినయపూర్వకమైన నివాళులు! మృతుల కుటుంబాలకు నా సానుభూతి. మరణించిన ఆత్మలకు భగవంతుడు శ్రీరాముడు తన పవిత్ర పాదాలలో చోటు కల్పించాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.’’ అని ట్వీట్ చేశారు. మరో ట్వీట్ లో ఈ ప్రమాదంలో మరణించిన యూపీ వాసుల మృతదేహాలను రాష్ట్రానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, దీని కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. 
 

click me!