
ఎల్పీజీ సిలిండర్ల ధరల పెంపును కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం, ప్రధాని నరేంద్ర మోడీ ఐరోపా పర్యటనను పోలుస్తూ ఆయన సెటైర్లు వేశారు. ‘షాబ్ మూడు దేశాల్లో 60 ఫొటో షూట్లు పూర్తి చేసి 65 గంటల తర్వాత తిరిగి వచ్చారు. ఎల్పీజీ ధర పెంచి ప్రజలకు బహుమతిగా ఇచ్చారు ’’ అని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం మోపుతోందని పవన్ ఖేరా ఆరోపించారు. ‘‘సబ్సిడీని వదులుకోవాలని మోదీ ప్రభుత్వం ప్రజలకు చెప్పింది. 2015-2016లో దీనిని 18 కోట్లకు, 2017లో సున్నాకు తగ్గించారు. ప్రతిరోజూ మీరు ప్రజలపై మరింత భారాన్ని సృష్టిస్తున్నారు.’’ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
‘‘ నేడు ప్రజలు ఎల్పీజీ సిలిండర్లను సరెండర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలకు సహాయం చేసి ఆదుకుంది. అధిక ధరల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు కాంగ్రెస్ ఈ సబ్సిడీని ఇచ్చిందని పవన్ ఖేరా అన్నారు.
బీజేపీ నేత తజిందర్ బగ్గా అరెస్టుపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. ‘‘ వారు రాష్ట్ర పోలీసులను ఒక జోక్ గా మార్చేశారు. భారత ప్రజాస్వామ్యం ఎంత పరిణితిని చూసి మేము గర్వించేవాళ్లం. కానీ ఢిల్లీ సీఎం భారత ప్రధాని దాన్ని ఎగతాళి చేశారు’’ అని ఖేరా అన్నారు.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి తజిందర్ బగ్గాను పంజాబ్ పోలీసులు ఆయన ఢిల్లీ నివాసం నుంచి శుక్రవారం ఉదయం అరెస్ట్ చేయడం చేశారు. మత విద్వేశాలు రెచ్చగొట్టారనే కారణంతో ఆయనను అరెస్టు చేసినప్పటికీ.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన వ్యక్తిగత అసంతృప్తిని చల్లార్చుకోవడానికి పంజాబ్ పోలీసులను ఉపయోగించుకుంటున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. శుక్రవారం ఉదయం ఉద్రిక్తత వాతావరణంలో, నాటకీయ పరిణామాల మధ్య ఆయన అరెస్టు జరిగింది. అయితే నేడు అతడు విడుదల అయ్యాడు.
తజీందర్ బగ్గా అరెస్టు విషయంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం బగ్గా తల్లి కమల్జీత్ కౌర్ ఆవేదన చెందుతూ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. తన కుమారుడి అరెస్టు సమయంలో పంజాబ్ పోలీసులు ప్రొటోకాల్ పాటించలేదని అన్నారు. కనీసం ఢిల్లీ పోలీసులకు ముందస్తు సమాచారం అందించలేదని చెప్పారు. వారు గుండాల్లా వ్యవహరించారని తెలిపారు.