అయ్యో పాపం.. బిందెలో తలపెట్టి ఇరుక్కుపోయిన చిరుత.. వీడియో వైరల్

By Sairam IndurFirst Published Mar 4, 2024, 12:07 PM IST
Highlights

ఓ చిరుత గ్రామంలోకి చొరబడింది. నీళ్లు తాగాలని భావించిందో లేక మరేదైనా కారణం ఉందో తెలియదు గానీ ఆ పులి ఓ బిందెలో తలపెట్టింది. కానీ దానిని మళ్లీ బయటకు తీయలేకపోయింది. దాదాపు 5 గంటల పాటు నరకయాతన అనుభవించింది.

మహారాష్ట్రలోని ధూలే జిల్లాలోని ఓ గ్రామంలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ చిరుత గ్రామంలోకి చొరబడి అనుకోకుండా ఓ బిందెలో తలపెట్టింది. కానీ బటయకు తీయలేకపోయింది. సుమారు ఐదు గంటల పాటు అలాగే నరకయాతన అనుభవించింది. ఈ విషయం తెలియగానే అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. చాలా కష్టపడి ఆ బిందెను తొలగించారు. 

‘‘ ధూలే జిల్లాలోని ఓ గ్రామంలో మగ చిరుత తన తలను లోహపు పాత్రలో ఇరుక్కుని ఐదు గంటల పాటు గడిపింది. అనంతరం అటవీశాఖ అధికారులు దాన్ని రక్షించారు’’ అని రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ సవితా సోనావానే వార్త సంస్థ ‘ఏఎన్ఐ’కు తెలిపారు. కాగా.. బిందెలో తలను పెట్టి ఇరుక్కోవడం, దాని నుంచి బయటపడేందుకు ఆ పులి చేసిన ప్రయత్నాలకు సంబంధించిన వీడియో సోషల్ లో వైరల్ గా మారింది. 

బిందెలో తలపెట్టి ఇరుక్కున్న చిరుత

మహారాష్ట్ర - ధూలె జిల్లాలోని ఓ గ్రామంలోకి ప్రవేశించిన చిరుత నీరు తాగడానికి బిందెలో తల పెట్టగా అందులో ఇరుక్కుపోయింది.

చివరికి ఫారెస్ట్ సిబ్బంది అక్కడికి చేరుకొని చిరుతకు మత్తుమందు ఇచ్చి బిందెను కట్ చేసి చిరుతను రక్షించారు. pic.twitter.com/IzqclOkIWF

— Telugu Scribe (@TeluguScribe)

ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 29న కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 'స్టేటస్ ఆఫ్ లెపర్డ్స్ ఇన్ ఇండియా, 2022' నివేదిక ప్రకారం భారత్ లో 2018లో 12,852 చిరుతలు ఉండగా, ప్రస్తుతం 13,874 చిరుతలు ఉన్నాయి. పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన నివేదిక ప్రకారం, దేశంలో చిరుతల సంఖ్య 2018 లో 12,852 నుండి 2022 లో 13,874 కు 8 శాతం పెరిగిందని ‘ఎన్డీటీవీ’ పేర్కొంది.

మధ్యప్రదేశ్ (3,907)లో అత్యధికంగా చిరుతపులులు నమోదు కాగా, మహారాష్ట్ర (1,985), కర్ణాటక (1,879), తమిళనాడు (1,070) రాష్ట్రాల్లో మాత్రమే 1,000కు పైగా జంతువులు నమోదయ్యాయి. వేట, మానవ-జంతు సంఘర్షణ కారణంగా ఉత్తరాఖండ్ లో పెద్ద పులుల సంఖ్య 22 శాతం తగ్గగా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో 150 శాతం పెరిగి 349 జంతువులకు చేరాయి.

click me!