ఇండియాలో టమాట ఫ్లూ ముప్పు.. వేగంగా వ్యాపించే సామర్థ్యం: హెచ్చరించిన లాన్సెట్

By Mahesh KFirst Published Aug 20, 2022, 4:10 PM IST
Highlights

భారత్‌లో టమాట ఫ్లూ ముప్పు ఉన్నదని, ఇది వేగంగా వ్యాపించే సామర్థ్యం కలిగిన వైరస్ అని ప్రముఖ మెడికల్ రీసెర్చ్ జర్నల్ ది లాన్సెట్ ఓ కథనంలో పేర్కొంది. ఈ వైరస్ పిల్లల్లోనే నమోదు అవుతున్నదని వివరించింది.
 

న్యూఢిల్లీ: ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ భారత్‌లో టమాట ఫ్లూ వ్యాప్తి గురించి ఆందోళన వెలిబుచ్చింది. ఇండియాకు టమాట ఫ్లూ ముప్పు ఉన్నదని వార్నింగ్ ఇచ్చింది. దేశంలో టమాట ఫ్లూ బలపడి కలకలం సృష్టించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. కేరళలోని కొల్లాంలో మే 6న టమాట ఫ్లూ తొలి కేసు నమోదైంది. ఇప్పటి వరకు 82 మంది పిల్లలకు ఈ ఫ్లూ సోకింది. వీరంతా ఐదేళ్ల లోపు వారేనని లాన్సెట్ వివరించింది.

దేశంలో కరోనా వైరస్ నాలుగో వేవ్ వచ్చే సూచికల నేపథ్యంలో మరో డిసీజ్ టమాట ఫ్లూ ముప్పు ముంగిట్లోనూ ఉన్నామని లాన్సెట్ తెలిపింది. ఇంటెస్టినల్ వైరస్‌ల ద్వారా ఈ టమాట ఫ్లూ వస్తుందని వివరించింది. ఇది చిన్న పిల్లల్లోనే ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నదని వివరించింది. వయోజనుల్లో ఈ కేసులు లేవని, ఈ వైరస్‌ను సహజంగానే ఎదుర్కొనే వ్యాధి నిరోధక శక్తిని వీరు కలిగి ఉంటారని తెలిపింది.

ఈ వైరస్ కారణంగా చర్మంపై బొబ్బలు వస్తాయి. అవి టమాట సైజుకు పెరుగుతాయి. ఈ కారణంగానే దీనికి టమాట ఫ్లూ అనే పేరు వచ్చింది. ఈ వ్యాధి వేగంగా వ్యాపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నదని లాన్సెట్ కథనం పేర్కొంది. ఈ వైరస్‌కు ఇప్పటి వరకు మందు లేదు. కానీ, ఈ వైరస్ దానంతట అదే నయమయ్యేది కావడం ఉపశమనం కలిగించే విషయం.

ఈ వైరస్ సోకిన వారిలో నీరసం, కీళ్ల వాపు, ఒళ్లు నొప్పులు, తీవ్ర జ్వరం ఉంటుంది. కొంతమందిలో వాంతులు, డయేరియా, జ్వరం, డీహైడ్రేషన్‌లు కూడా కనిపిస్తున్నాయి.

ఈ వైరస్ మన దేశంలో ఇపపటి వరకు మూడు రాష్ట్రాల్లో రిపోర్ట్ అయింది. కేరళలోని కొల్లాంతోపాటు ఆంచల్, అర్యాంకావు, నెడువతూర్‌లలో నమోదు అయింది. వీటితోపాటు తమిళనాడు, ఒడిశాలోనూ టమాట ఫ్లూ కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఒడిశాలో ఒక సంవత్సరం నుంచి తొమ్మిదేళ్ల లోపు పిల్లలు 26 మందికి ఈ వైరస్ సోకినట్టు రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది.

click me!