ఢిల్లీ లిక్కర్ స్కామ్... ఐదుగురికి సీబీఐ సమన్లు

By Siva KodatiFirst Published Aug 20, 2022, 3:37 PM IST
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఐదుగురికి సీబీఐ సమన్లు జారీ చేసింది. వీరిని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఐదుగురికి సీబీఐ సమన్లు జారీ చేసింది. వీరిని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా.. ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయమై దేశమంతా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం 20 ప్రాంతాలలో సీబీఐ తనిఖీలు చేసింది. ఓ బృందం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలోనూ తనిఖీలు చేసింది. ఈ క్రమంలో ఈ కేసులోని నిందితుల వివరాలు బయటకు వచ్చాయి. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను ఎన్‌డీటీవీ యాక్సెస్ చేసింది. ఇందులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా తెలంగాణ వాసి కూడా ఉండటం గమనార్హం.

సీబీఐ ఎఫ్ఐఆర్‌లో మొత్తం 15 మంది పేర్లను పేర్కొంది. వీరితోపాటు ఇతరులూ అని చేర్చింది. దీంతో నిందితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. తొమ్మిది నెలలపాటు అమలు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతి చోటుచేసుకున్నదనేది ప్రధాన ఆరోపణగా ఉన్నది. ఈ పాలసీ గత నెలనే రద్దు చేశారు. 11 పేజీల ఆ ఎఫ్ఐఆర్ కాపీలో నేరపూరిత కుట్ర, ఫాల్సిఫికేషన్‌లు ప్రధాన ఆరోపణలుగా సీబీఐ చేర్చింది.

ALso REad:ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ వాసి

ఈ ఎక్సైజ్ పాలసీ అమలు కాలంలో బాధ్యులుగా ఉన్నవారిని ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. అందులో తొలి పేరు ఢిల్లీ ఎక్సైజ్ మినిస్టర్ మనీష్ సిసోడియా పేరు ఉన్నది. అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అర్వ గోపీ కృష్ణ రెండో పేరుగా ఉన్నది. కాగా, ఈ జాబితాలో తెలంగాణ వాసి పేరు కూడా ఉన్నది. 14వ పేరుగా అరుణ్ రామచంద్ర పిళ్లై పేరును సీబీఐ పేర్కొంది. ఈయన శాశ్వత నివాసం తెలంగాణలోని కోకాపేట్‌ ఈడెన్ గార్డెన్స్ సుశీ రియాల్టీగా తెలిపింది. అయితే, తాత్కాలిక నివాసంగా కర్ణాటకలోని బెంగళూరుగా పేర్కొంది.

click me!