కొవాగ్జిన్ మూడో దశ ఫలితాలు ప్రచురించిన లాన్సెట్.. డెల్టా వేరియంట్‌పై సామర్థ్యం ఎంతంటే?

By telugu teamFirst Published Nov 12, 2021, 12:52 PM IST
Highlights

కొవాగ్జిన్ టీకా మూడో దశ ఫలితాలను ప్రపంచ ప్రసిద్ధ మెడికల్ జర్నల్ ది లాన్సెట్ జర్నల్ ప్రచురించింది. కరోనాను ఎదుర్కొనే సామర్థ్యం ఈ టీకాకు 77.8శాతం ఉన్నట్టు వివరించింది. డెల్టా వేరియంట్‌పై కొవాగ్జిన్ 65.2శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపింది. అయితే, దీని ధ్రువీకరణకు మరింత పరిశోధన జరగాలని పేర్కొంది.
 

న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్(Bharat Biotech) Covaxin టీకాను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. కొవాగ్జిన్ Vaccineకు ఈ నెల 3న ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అత్యవసర వినియోగ అనుమతులు ఇచ్చింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కొవాగ్జిన్ టీకా వేసుకున్నవారు ప్రయాణించడానికి మార్గం సుగమమం అవడమే కాకుండా.. టీకానూ ఎగుమతి చేసేందుకు దారులు తెరుచుకున్నాయి. తాజాగా, కొవాగ్జిన్ టీకా మూడో దశ ప్రయోగ ఫలితాలను ప్రసిద్ధ మెడికల్ జర్నల్ ది లాన్సెట్ ప్రచురించింది. దీంతో కొవాగ్జిన్ టీకా సామర్థ్యంపై కొందరిలో నెలకొన్న సంశయాలన్నింటినీ తుడిచేసినట్టయింది.

కొవాగ్జిన్ టీకా సామర్థ్యం 77.8శాతంగా The Lancet జర్నల్ ప్రచురించింది. సింప్టమాటిక్ కొవిడ్‌ను 77.8 శాతం నివారిస్తుందని, కరోనా వైరస్ వేరియంట్లను 70.8శాతం నిలువరిస్తుందని పేర్కొంది. అయితే, ప్రస్తుతం ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తున్న డెల్టా వేరియంట్‌పై ఈ టీకా ప్రభావం 65.2శాతంగా ఉంటుందని వివరించింది. ఇది ప్రాథమిక విశ్లేషణలో తేలిందని, దీన్ని ధ్రువీకరించడానికి మరింత పరిశోధన జరగాలని తెలిపింది.

Also Read: భారత్ బయోటెక్‌కు ఊరట.. కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం

కొవాగ్జిన్ టీకా రెండో డోసు వేసుకున్న 14 రోజుల తర్వాత యాంటీ బాడీ రెస్పాన్స్ ప్రారంభమవుతుందని జర్నల్ వివరించింది. దేశవ్యాప్తంగా 24,419 మంది వాలంటీర్లతో కొవాగ్జిన్ టీకా ట్రయల్స్ జరిగాయి. 2020 నవంబర్ నెల నుంచి 2021 మే నెల వరకు మన దేశంలో ఈ ట్రయల్స్ జరిగాయని లాన్సెట్ జర్నల్ వివరించింది. 18 ఏళ్ల నుంచి 97 ఏళ్ల వాలంటీర్లు ఇందులో పాల్గొన్నారని తెలిపారు.

సెకండ్ డోసు వేసుకున్న 14 రోజుల తర్వాత కరోనా పై కొవాగ్జిన్ 77.8శాతం సమర్థంగా పనిచేస్తుందని లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. కాగా, తమ ప్రాథమిక విచారణలో డెల్టా వేరియంట్‌ను కొవాగ్జిన్ టీకా 65.2 శాతం ఎదుర్కొంటుందని తెలిపింది. మూడో దశ ఫలితాల ప్రకారం, డెల్టా వేరియంట్‌పై టీకా సామర్థ్యం 65.2 శాతం, తీవ్ర లక్షణాలున్న కొవిడ్‌ను 93.4శాతం సమర్థంగా ఎదుర్కొంటుంది. కాగా, లక్షణాలు కనిపించని కరోనాపై ఈ టీకా సామర్థ్యం 63.6శాతంగా థర్డ్ ఫేజ్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. డెల్టా సహా ఇతర వేరియంట్లపైనా కొవాగ్జిన్ సామర్థ్యాన్ని ధ్రువీకరించడానికి మరింత పరిశోధన జరగాల్సి ఉన్నదని లాన్సెట్ జర్నల్ వివరించింది.

Also Read: Booster Dose: రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న 6 నెలలకు బూస్టర్ డోస్.. భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా

కొవాగ్జిన్ టీకా థర్డ్ ఫేజ్ ఫలితాలను లాన్సెట్ జర్నల్ వెల్లడించడంపై భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ స్పందించారు. టీకా ప్రయోగ వివరాలు, డేటాపై భారత్ బయోటెక్ పారదర్శంగా వ్యవహరిస్తుందని, అంతర్జాతీయ ప్రసిద్ధ మెడికల్ జర్నల్‌ల పీర్ రివ్యూకు కావాల్సిన ప్రమాణాలను పాటిస్తుందని ఈ కథనం వెల్లడించిందని డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. భారత్ బయోటెక్ టీమ్, ఐసీఎంఆర్, ఎన్ఐవీ, ట్రయల్స్‌లో పాల్గొన్న వాలంటీర్ల కమిట్‌మెంట్‌ను ప్రతిఫలించిందని వివరించారు. ఫేజ్ 3 డేటాను ప్రపంచ ప్రసిద్ధ మెడికల్ జర్నల్ లాన్సెట్ ప్రచురించడం సంతోషంగా ఉన్నదని డాక్టర్ బలరాం భార్గవ అన్నారు. ప్రపంచ ప్రఖ్యాత టీకాల సరసన కొవాగ్జిన్ పొజిషన్‌ను ఈ కథనం సుస్థిరం చేసిందని చెప్పారు.

click me!