
Kumudwati River Bridge accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివమొగ్గలో రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కుముద్వతి నది వంతెన సమీపంలో జాతీయ రహదారి (ఎన్ హెచ్) 206పై రెండు ప్రయివేటు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదం గురించి పోలీసులు వెల్లడించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో గురువారం రాత్రి రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. కుముద్వతి నది వంతెన సమీపంలో జాతీయ రహదారి (ఎన్ హెచ్) 206పై రెండు ప్రైవేటు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
మృతులు, క్షతగాత్రులను గుర్తించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. వారి కుటుంబ సభ్యులకు ప్రమాదం గురించి సమాచారం అందించినట్టు పోలీసులు పేర్కొన్నారు. శికారిపూర్ నుంచి చోరాడి మీదుగా శివమొగ్గ వెళ్తున్న వెంకటమహాలక్ష్మి ట్రాన్స్ పోర్ట్ కు చెందిన బస్సు శివమొగ్గ నుంచి సాగర వైపు వెళ్తున్న శ్రీనివాస ట్రాన్స్ పోర్ట్ కు చెందిన మరో ప్రయివేటు బస్సును ఢీకొట్టింది. ప్రమాదం జరిగే ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం శివమొగ్గ నగరంలోని ఎంసీ గన్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.
బెంగళూరులో మరో ప్రమాదంలో ఇద్దరు మృతి
గురువారం ఉదయం బెంగళూరు సమీపంలో స్కూటర్ కారును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, కొద్ది రోజుల క్రితం జరిగిన కులపరమైన గొడవ నేపథ్యంలో జరిగిన హత్యేనని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఓ మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితులను నాగరాజు(38), రామయ్య(48),గోపాల్(33)గా పోలీసులు గుర్తించారు. ముగ్గురూ చల్లహళ్లి గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. నాగరాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్ భరత్ పై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు బెంగళూరు పోలీసు సూపరింటెండెంట్ ధృవీకరించారు.
ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాగరాజు కొద్ది రోజుల క్రితం హేసరఘట్టలోని ఓ హోటల్ లో నీళ్లు తాగే విషయంలో భరత్ తో గొడవ పడ్డాడు. అగ్రవర్ణానికి చెందిన భరత్ అదే హోటల్లో నాగరాజు భోజనం చేస్తుండగా నీళ్లు తాగడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఎన్నికలు ముగిశాక నాగరాజును చంపేస్తానని భరత్ బెదిరించాడని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. భరత్ కావాలనే స్కూటర్ ను ఢీకొట్టడంతోనే మృతి చెందాడని నాగరాజు బంధువులు ఆరోపిస్తున్నారు. గురువారం ఉదయం 5.30 గంటల సమయంలో బాధితులు రాజనుకుంటలోని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పశువుల దాణా కర్మాగారంలో పనిచేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.