
త్వరలో విడుదల కాబోతున్న ది కేరళ స్టోరీ సినిమాపై కేరళ సీఎం పినరయి విజయన్ విరుచుకుపడ్డారు. ఈ సినిమా మతపరమైన విభజన చేయడానికి, రాష్ట్రానికి వ్యతిరేకంగా విద్వేషాన్ని ప్రచారం చేసే లక్ష్యంతోనే ఈ సినిమా తీసినట్టు అర్థం అవుతున్నదని ఆరోపించారు. ఈ అవాస్తవ కథ... సంఘ్ పరివార్ అబద్ధాల ఫ్యాక్టరీ నుంచే పుట్టిందని అన్నారు.
ది కేరళ స్టోరీ సినిమాపై తన తొలి స్పందనలో సంఘ్ పరివార్ అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నానికి పూనుకున్నట్టు ఈ సినిమా ట్రైలర్ సూచనలు ఇస్తున్నదని సీఎం పినరయి వివరించారు. లౌకిక భూమి కేరళలో మతపరమైన అతివాదానికి కేంద్రం ఈ సంఘ్ పరివార్ అని విమర్శించారు.
‘ఫేక్ స్టోరీలు, ఫేక్ సినిమాలతో విభజన రాజకీయాలను ప్రచారం చేయడానికి సంఘ్ పరివార్ ప్రయత్నిస్తున్నది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేని కట్టుకథలను వ్యాప్తి చేస్తున్నది. కేరళలో 32 వేల మంది మహిళలు ఇస్లాంలోకి మారారనేది పచ్చి అబద్ధం. వారు ఇస్లామిక్ స్టేట్‌లో చేరాని అవాస్తవాలను ఈ సినిమా ట్రైలర్‌లో చూపించారు. ఈ ఫేక్ స్టోరీ సంఘ్ పరివార్ అబద్ధాల ఫ్యాక్టరీ ఉత్పత్తే’ అని సీఎం అన్నారు.
కేరళలో ఎన్నికల్లో లబ్ది పొందడానికి సంఘ్ పరివార్ చేస్తున్న ప్రయత్నాల్లోనే ఈ సినిమాలు, ముస్లిం పరాయీకరణ విధానాలను చూడాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
ది కేరళ స్టోరీ సినిమాను అధికార సీపీఎం, విపక్ష కాంగ్రెస్‌లు విమర్శించాయి. విషాన్ని వెదజల్లడానికి భావ ప్రకటన స్వేచ్ఛ లైసెన్స్ కాదని అన్నారు. అవాస్తవ వాదనలతో సమాజంలో మత విభజనను తీసుకురావడానికి తీసిన ఈ సినిమా విడుదలకు అనుమతులు ఇవ్వరాదని కాంగ్రెస్ పార్టీ కోరింది.
ది కేరళ స్టోరీ సినిమా లవ్ జిహాద్ ఆరోపణలతో తీశారని, వాస్తవానికి ఈ ఆరోపణలను దర్యాప్తు సంస్థలు, కోర్టులు, చివరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి కూడా ఖండించారు. లవ్ జిహాద్ వంటిదేమీ లేదని కొట్టిపారేశారని సీఎం గుర్తు చేశారు. అయినా.. ఈ అవాస్తవ ఆరోపణలను ప్రధానంగా చేసుకుని సినిమా తీశారని, ఇది కేవలం ప్రపంచం ముందు కేరళను అవమానించడానికి చేసిన ఆరాటమే అని విరుచుకుపడ్డారు. కేరళలో ఉన్న సామరస్యాన్ని చెదరగొట్టడానికి సంఘ్ పరివార్ ఈ ప్రయత్నానికి పూనుకుందని పేర్కొన్నారు. కానీ, పరివార్ రాజకీయాలు కేరళలో సాగవని అన్నారు.
మలయాళీ ప్రజలు జాగరూకతగా ఉండి అవాస్తవాలకూ దూరంగా ఉండాలని సీఎం కోరారు. యాంటీ సోషల్ యాక్టివిటీలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు.