
వ్యాపారాన్ని సరిగా నిర్వహించడం లేదనే కోపంతో కుమారుడికి నిప్పంటించాడో తండ్రి. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. ఈ ఘటన ఏప్రిల్ 1వ తేదీన చోటు చేసుకుంది. అయితే అప్పటి నుంచి బాధితుడు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి గురువారం మృతి చెందాడు.
ఈ ఘటనకు సంబంధించి వివరాల ఇలా ఉన్నాయి. 55 ఏళ్ల సురేంద్ర కుమార్ నుంచి మూడేళ్ల కిందట ఆయన కుమారుడు అర్పిత్ సెటియా వ్యాపారం స్వాధీనం చేసుకున్నారు. వారిది పెయింట్ ఫాబ్రికేషన్ వ్యాపారం. అయితే అప్పటి నుంచి దానిని సరిగా నిర్వహించడం లేదు. పైగా అర్పిత్ సెటియా మైసూరు రహదారికి దగ్గరలో ఉన్న భవనం నుంచి అద్దె తీసుకుంటున్నాడు.
మూడేళ్ల నుంచి కుమారుడు అర్పిత్ సెటియా వ్యాపారం సక్రమంగా నిర్వహించడం లేదని తండ్రి కొంత కాల నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మొత్తంగా కుమారుడు రూ. 1.5 కోట్ల అప్పు అయ్యాడని ఆయన గుర్తించారు. అయితే ఈ నెల 1వ తేదీన చామరాజ్‌పేటలోని వాల్మీకి నగర్‌లో వ్యాపారం నిర్వహించే ప్రదేశానికి తండ్రి వెళ్లాడు. రూ. 1.5 కోట్ల కు సంబంధించిన లెక్కలు చూపించాలని కుమారుడిని కోరారు. అయితే దీనికి కుమారుడు నిరాకరించాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది.
ఈ గొడవ చాలా పెద్దదిగా మారింది. దీంతో వారిద్దరూ ఆ పని ప్రదేశం నుంచి గొడవ పడుతూనే బయటకు వచ్చారు. ఇలా 30 నిమిషాల పాటు గొడవపడ్డ తరువాత కోపంతో తండ్రి సురేంద్ర కుమార్ అర్పిత్ ను ఓ రకమైన ద్రావణంలో ముంచాడు. అది స్పిరిట్ తో తయారు చేసిన ఓ రకమైన ద్రావణం. దీంతో అర్పిత్ అక్కడి నుంచి పారిపోవడం ప్రారంభిస్తారు. అతడిని తండ్రి వెంబడించాడు. తనను ఏమీ చేయొద్దని తండ్రిని కుమారుడు వేడుకుంటాడు. కానీ తండ్రి అవేవి వినిపించుకోలేదు.
తండ్రి తన వద్ద ఉన్న అగ్గిపుల్లను ఒక సారి వెలిగించే ప్రయత్నం చేస్తాడు. కానీ అది ఆరిపోతుంది. వద్దు వద్దని అర్పిత్ వేడుకుంటున్నా వినకుండా మరో సారి అగ్గిపుల్ల వెలిగించి అతడిపైకి విసిరాడు. దీంతో అతడికి వెంటనే మంటలు అంటుకున్నాయి. ఆ మంటలతోనే అర్పిత్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
కొంత సమయం తరువాత స్థానికులు అతడి వద్దకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. వెంటనే అర్పిత్ ను విక్టోరియా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. 60 శాతం కాలిన గాయాలతో రెండు రోజుల పాటు ప్రాణాలతో పోరాడాడు. చివరికి పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం అర్పిత్ మృతి చెందాడు. దీంతో నిందితుడు సురేంద్ర కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.