స్థలం కబ్జా చేశారని తండ్రి ఫిర్యాదు, కూతురిపై వేధింపులు.. పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధితురాలి ఆత్మహత్య..

Published : Jul 07, 2023, 11:10 AM IST
స్థలం కబ్జా చేశారని తండ్రి ఫిర్యాదు, కూతురిపై వేధింపులు.. పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధితురాలి ఆత్మహత్య..

సారాంశం

బహిరంగ స్థలాన్ని కొందరు వ్యక్తులు కబ్జా చేశారని ఓ కాంట్రాక్టర్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు వచ్చి ఆ కబ్జాను తొలగించారు. దీంతో ఆక్రమణదారులు ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశారు. అతడి కూతురుని, మేనకోడలిని రోడ్డుపై అడ్డుకొని తీవ్రంగా దూషించారు.దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై చర్యలు తీసుకోకపోవడంతో బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. 

ఓ బాలిక ఇద్దరు దుండగుల చేతిలో వేధింపులకు గురైంది. దీనిపై ఆమె తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో పోలీసులు నాలుగు నెలల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఆ దుండగులు మళ్లీ వేధింపులు మొదలుపెట్టారు. ఈ విషయంలో మనస్థాపం చెందిన బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగింది.

‘టైమ్స్ ఆప్ ఇండియా’ కథనం, బాధితురాలి తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రా జిల్లా జగదీష్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ వ్యక్తి  విద్యుత్ శాఖలో కాంట్రాక్టర్ గా పని చేస్తున్నాడు. ఆయన నివసించే ప్రాంతంలోని ఓ బహిరంగ స్థలాన్ని పక్కనే ఉండే వ్యక్తులు ఆక్రమించారు. ఈ విషయాన్ని ఆయన ఆగ్రా మునిసిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు వచ్చి ఆక్రమణను తొలగించారు. కాగా.. ఈ ఏడాది జనవరి 1వ తేదీన ఆయన 18 ఏళ్ల కూతురు, బంధువుల అమ్మాయితో కూరగాయాలు కొనేందుకు స్కూటీపై మార్కెట్ కు వెళ్లారు. మార్గమధ్యంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి వారిని అడ్డగించారు. అసభ్య పదజాలంతో దూషించారు.

ఇంటి పక్కన నివసించే వారిపై ఫిర్యాదు చేయవద్దని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని తండ్రికి చెప్పాలని బాలికను బెదిరించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాన్ని ఆ బాలికలు ఇద్దరూ ఆ కాంట్రాక్టర్ కు తెలియజేశారు. దీంతో ఆయన తన కుమార్తె, మేనకోడలు వేధింపులకు గురయ్యారని, తరువాత తన కుటుంబం కూడా కష్టాలను ఎదుర్కొందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ మొదట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పలుమార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లి, మహిళా కమిషన్ కు లేఖ రాశారు. పోలీస్ కమిషనర్ ను కలిసిన తర్వాత చివరకు ఘటన జరిగిన 46 రోజుల తర్వాత ఫిబ్రవరి 17న ఎఫ్ఐఆర్ నమోదైంది. 

పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ 354 (మహిళ గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశంతో దాడి చేయడం లేదా క్రిమినల్ బలవంతం చేయడం), 341 (తప్పుడు సంయమనం), 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు నాలుగు నెలలకు పైగా విచారణ జరిపారు. ఇద్దరు బాలికల వాంగ్మూలం నమోదు చేసుకోవడానికి పిలవలేదు. 

అయితే నిందితులు ఆ కుటుంబాన్ని వేధిస్తూనే ఉన్నారు. తరచూ ఆ బాలికను టార్గెట్ చేశారు. దీంతో ఆమె తీవ్ర ఒత్తిడికి గురైంది. నిందితులపై ఫిర్యాదు చేసినా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, వారి వేధింపులు మరింత ఎక్కువవడంతో ఆమె ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసు కమిషనర్ ప్రీతిందర్ సింగ్ స్పందించారు. ఈ కేసులో కొన్ని పొరపాట్లు జరిగి ఉండొచ్చని ఆమె అంగీకరించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. 

కాగా.. నిందితులకు సంబంధించిన గత కేసు విషయంలో దర్యాప్తు అధికారి పాత్ర లోపభూయిష్టంగా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆ పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ ను పోలీస్ లైన్ కు బదిలీ చేశారు. శాఖాపరమైన విచారణ కు ఆదేశించారు. అయితే ఈ కేసులో అరెస్టయిన నిందితుడు ప్రమేంద్ర కుమార్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పని చేస్తున్నారు. అతడి తండ్రి అమర్ సింగ్, భార్య డింపుల్ పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో పోలీసులు చేర్చారు. 

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.
 

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !