
నిరక్ష్యరాస్యులైన వయోజనుల కోసం కేంద్ర ప్రభుత్వం న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ (New India Literacy Program) ను బుధవారం ఆమోదించింది. దీనిని 2022-2027 అర్థిక సంవత్సరంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జాతీయ విద్యా విధానం - 2020 (national education policy) కు అనుగుణంగా ఈ ప్రొగ్రామ్ ను రూపొందించారు.
ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఇంత వరకు ‘‘వయోజన విద్య’’ అని పేర్కొంటున్న పదాన్ని ‘‘ అందరి కోసం విద్య ’’ అనే పదంగా మారుస్తున్నట్టు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్ ను 15 సంవత్సరాలు దాటిన నిరక్షరాస్యుల కోసం రూపొందించారు. ఈ వివరాలను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో షేర్ చేసింది. “ NEP 2020 దృక్పథం ప్రకారం ప్రభుత్వం New India Literacy Programని ఆమోదించింది. దీని కోసం 5 సంవత్సరాలకు 1037.90 కోట్ల బడ్జెట్ అంచనా వేసింది. ఈ కార్యక్రమం 15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల నిరక్షరాస్యులకు విద్యను అందించాలని భావిస్తోంది ’’ అని విద్యా మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది.
న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ అంటే ఏమిటి ?
ఈ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 15 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల నిరక్షరాస్యుల కోసం ఉద్దేశించినది. ఆన్‌లైన్ టీచింగ్, లెర్నింగ్ అండ్ అసెస్‌మెంట్ సిస్టమ్ (OTLAS) ద్వారా 2022-27 ఆర్థిక సంవత్సరాల్లో సంవత్సరానికి కోటి మందికి చొప్పున బేసిక్ ఎడ్యుకేషన్ అందించాలి. దీంతో పాటు సంఖ్యాశాస్త్రం, ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యత, వాణిజ్య నైపుణ్యాలు, ఆరోగ్య సంరక్షణ, అవగాహన నేర్పిస్తారు. ఈ ఐదేళ్లలో ఇలా 5 కోట్ల మందికి విద్యను అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC), NCERT. NIOS సహకారంతో ప్రోగ్రామ్ ను అమలు చేస్తారు. ఇందులో చదువుకునే వారి పేరు, పుట్టిన తేదీ, జెండర్, ఆధార్ నంబర్, మొబైల్ నెంబర్ వంటి సమాచారం ఆధారంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ మొత్తం అంచనా వ్యయం రూ.1037.90 కోట్లు. కాగా ఇందులో 2022-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర వాటా రూ.700 కోట్లు, రాష్ట్రాల వాటా రూ.337.90 కోట్లుగా ఉంటాయి.
ఈ పథకాన్ని ఆన్‌లైన్‌లో అమలు చేయనున్నారు. UDISE (యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్) కింద నమోదైన దాదాపు 7 లక్షల పాఠశాలల్లోని మూడు కోట్ల మంది విద్యార్థులు, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన దాదాపు 50 లక్షల మంది ఉపాధ్యాయులు వాలంటీర్లుగా పాల్గొంటారు.
ఉపాధ్యాయ విద్య. ఉన్నత విద్యా సంస్థల నుంచి సుమారు 20 లక్షల మంది విద్యార్థులు వాలంటీర్లుగా యాక్టివ్ గా పాల్గొంటారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, PRIలతో పాటు దాదాపు 50 లక్షల మంది NYSK, NSS, NCC కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తమ వంతు మద్దతును అందిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది.