ప్రధాని ర్యాలీకి వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టడంతో 39 మందికి గాయాలు

By Asianet News  |  First Published Sep 25, 2023, 1:41 PM IST

భోపాల్ లో ప్రధాని ర్యాలీకి వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న ఓ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న 39 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.


మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో 39 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన  ఖార్గోన్ జిల్లాలోని కస్రావాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. క్షతగాత్రులంతా భోపాల్ లో ప్రధాని మోడీ ర్యాలీ జరిగే ప్రదేశానికి వెళ్తున్నారు.

సోమవారం మధ్యాహ్నం మధ్యప్రదేశ్ రాజధానిలో బీజేపీ కార్యకర్తల మెగా సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొని, ప్రసంగిస్తున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వారంతా ఓ ప్రైవేట్ బస్సులో ఆదివారం రాత్రి బయలుదేరారు. అయితే ఆ బస్సు ఖార్గోన్ జిల్లాలోని గోపాల్ పురా గ్రామ సమీపంలోకి చేరుకునే సరికి అక్కడ ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది.

Latest Videos

గాయపడిన 39 మందిని ఆసుపత్రికి తరలించినట్లు ఖర్గోన్ జిల్లా ఆసుపత్రి సివిల్ సర్జన్ అమర్ సింగ్ చౌహాన్ తెలిపారు. క్షతగాత్రుల్లో చాలా మందిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జి చేశామని, వారిలో తీవ్రంగా గాయపడిన ఒకరిని మెరుగైన చికిత్స కోసం ఇండోర్ కు తరలించామని తెలిపారు. క్షతగాత్రులు భోపాల్ ప్రధాని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు.  ఆ బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిందని సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ (ఎస్ డిఒపి) మనోహర్ గావ్లీ తెలిపారు.

ఇలాంటి ఘటనే ఈ నెల 15వ తేదీన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్రక్కును ఓ కారు ఢీకొట్టడంతో నలుగురు మరణించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ ప్రాంతానికి చెందిన పలువురు వ్యక్తులు కోకిలవన్ ధామ్ శని మందిర్ ను దర్శించాలని భావించారు. అందుకే ఓ వారు కారులో శుక్రవారం ప్రయాణం ప్రారంభించారు. అయితే ఆ వాహనం శనివారం ఉదయం ఢిల్లీ-ఆగ్రా జాతీయ రహదారిపై ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో మథుర వద్దకు చేరుకోగానే అక్కడ ఆగి ఉన్న ఓ ట్రక్కును వెనకాల నుంచి కారు ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నిషిద్, అలోక్, ఆకాష్ అనే ముగ్గురు ప్రయాణికులు, ట్రక్కు డ్రైవర్ అజిత్ అక్కడికక్కడే మృతి చెందినట్లు మథుర (ఉత్తరప్రదేశ్) పోలీసు సూపరింటెండెంట్ మార్తాండ్ ప్రకాశ్ సింగ్ తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న వారు అలీగఢ్ వాసులు అని, ట్రక్కు డ్రైవర్ బీహార్ లోని చాప్రాకు చెందినవారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

click me!