పంద్రాగస్టున దాడికి ఉగ్రకుట్రలు.. భద్రతా దళాలు హై అలర్ట్

By telugu teamFirst Published Aug 12, 2021, 8:27 PM IST
Highlights

భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలే లక్ష్యంగా ఇక్కడ పేలుళ్లకు లష్కర్-ఏ-తాయిబా, జైష్-ఏ-మొహమ్మద్‌ ఉగ్రసంస్థలు ప్రణాళికలు రచిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. సరిహద్దు దాటి బీభత్సం సృష్టించడానికి పాక్ ఆక్రమిత భూభాగంలో కాచుక్కూర్చున్నాయని తెలిపాయి. గతవారం రోజులుగా కశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు సెక్యూరిటీ ఏజెన్సీలన్నీ హై అలర్ట్‌లోనే ఉండటం గమనార్హం.

న్యూఢిల్లీ: ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాన లష్కర్-ఏ-తాయిబా, జైష్-ఏ-మొహమ్మద్ ఉగ్రసంస్థలు సెక్యూరిటీ పోస్టులు, భద్రతాపరంగా కీలకమైన ప్రాంతాల్లో దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు నిఘావర్గాలు హెచ్చరించాయి. ఇప్పటికే జమ్ము కశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు భద్రతా బలగాలు హై అలర్ట్‌లో ఉన్నాయి. ఈ తరుణంలో లష్కర్, జైషే ఉగ్రసంస్థలు భారత్‌లో దాడుల కోసం సమగ్ర ప్రణాళికలు వేస్తున్నట్టు సూచనలు రావడం గమనార్హం.

ముష్కరుల కుట్రలను దృష్టిలో పెట్టుకునే గతవారం రోజులుగా కశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు సెక్యూరిటీ ఏజెన్సీలన్నీ హై అలర్ట్‌లో ఉన్నాయి. పంద్రాగస్టు సమీపిస్తుండటంతో పాకిస్తాన్ నుంచి పేలుడు పదార్థాలు, ఆయుధాలు భారత భూభాగంలోకి చేర్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యే అవకాశాలున్నట్టు నిఘావర్గాలు వివరించాయి. భద్రతా బలగాలు, సరిహద్దులోని మిలిటరీ పోస్టులు, కీలక స్థావరాలు ముష్కరుల లక్ష్యంగా ఉండే అవకాశముందని తెలిపాయి. టెర్రరిస్టులు ఇంతలోపు భారత భూభాగంలోకి చొచ్చుకురావడానికి కాచుక్కూర్చున్నాయని పేర్కొన్నాయి.

చిన్న చిన్న ఆయుధాలనూ భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నాయని, వాటి ద్వారా ఇండివిడ్యువల్‌ను టార్గెట్ చేసే అవకాశముంటుందని, అలాగే, తక్కువ మొత్తంలో అంటే రెండు లేదా మూడు కిలోల ఆర్డీఎక్స్‌తో కూడి పేలుడు పదార్థాలనూ సరిహద్దు గుండా మనదేశంలోకి పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.  లష్కర్ కమాండర్ మొహమ్మద్ సాదిఖ్ సారథ్యంలో ఆరుగురు ఉగ్రవాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కోటిల్‌లో ఉన్నారని, ఈ నెల 15లోపు సరిహద్దు దాటే వ్యూహంతో వారున్నట్టు తెలిసింది.

పీవోకేలోని దతోట్‌లో బాలాకోట్ సరిహద్దు గుండా ఐదుగురు జైషే టెర్రరిస్టులున్నారని, భారత మిలిటరీ లక్ష్యంగా సరిహద్దులోని స్థావరాలపై పేలుళ్లకు ప్లాన్ వేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

మరో నలుగురు లష్కర్ తీవ్రవాదులు సరిహద్దు దాటి భారత్‌లోకి ప్రవేశించే లక్ష్యంతో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం వారు పీవోకేలోని తుండ్వాలా అటవీ ప్రాంతంలో ఉన్నారని, త్వరలోనే కశ్మీర్ లోయవైపుగా కదలవచ్చని నిఘావర్గాలు వివరించాయి.

click me!