చర్చ నుంచి పారిపోయేందుకే రాజ్యసభలో రచ్చ: విపక్షాలపై జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం

By Siva KodatiFirst Published Aug 12, 2021, 6:05 PM IST
Highlights

బుధవారం రాజ్యసభలో జరిగిన పరిణామాలపై స్పందించారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. పెగాసస్‌పై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టమైన ప్రకటన చేశారని జీవీఎల్ గుర్తుచేశారు. పార్లమెంట్ సమావేశాలను విపక్షాలు ఖూనీ చేశాయని ఆయన మండిపడ్డారు

విపక్షాలు దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు బీజేపీ  రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. నిన్న రాజ్యసభలో జరిగిన పరిణామాలపై ఆయన ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడారు. చర్చ నుంచి పారిపోవడానికి విపక్షాలు ప్రయత్నించాయని నరసింహారావు మండిపడ్డారు. పెగాసస్‌పై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టమైన ప్రకటన చేశారని జీవీఎల్ గుర్తుచేశారు. పార్లమెంట్ సమావేశాలను విపక్షాలు ఖూనీ చేశాయని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభ బెంచ్ ఎక్కి సభ ప్రతిష్టను దిగజార్చారని.. రచ్చ చేసి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నాయని జీవీఎల్ ఆరోపించారు. కాంగ్రెస్ లోక్‌సభలో ఒకలా.. రాజ్యసభలో మరోలా వ్యవహరిస్తోందని నరసింహారావు దుయ్యబట్టారు. 

అంతకుముందు పార్లమెంటులో వీరంగం సృష్టించిన విపక్షాలు దేశానికి క్షమాపణలు చెప్పాలని, ప్రతిపక్షాల నిర్వాకం వల్లే పార్లమెంటు సమావేశాలను రెండు రోజులు ముందుగా నిరవధిక వాయిదా వేయాల్సి వచ్చిందని ఏడుగురు కేంద్ర మంత్రులు అన్నారు. రాజ్య సభలో మార్షల్స్‌ తమపై దాడికి పాల్పడ్డారని, ఇది ప్రజాస్వామ్యాన్ని హత్యచేసినట్టేనని రాహుల్ గాంధీ సారథ్యంలో ఈ రోజు ఉదయం 15 పార్టీల ఎంపీలు నిరసనల చేసిన సంగతి తెలిసిందే. వారసలు మార్షల్స్ కాదని, బయటి వారినే సభలోకి అనుమతించారని, వారు మహిళా ఎంపీలపైనా దాడికి దిగారని ఆరోపించారు. ప్రతిపక్షాల ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ ఏడుగురు కేంద్రమంత్రులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఒక్కొక్కరు ప్రతిపక్షాల ఎంపీల తీరును ఎండగట్టారు.

Also Read:మమ్మల్నే బెదిరించారు: విపక్షంపై ఏడుగురు కేంద్రమంత్రుల ఆరోపణ

దేశ ప్రయోజనాలకు, సంక్షేమ కార్యక్రమాల కోసం తమను ప్రజలు అధికారంలోకి పంపారని, కానీ, ప్రభుత్వ కార్యకలాపాలను విపక్షాలు అడ్డుకుంటున్నాయని కేంద్రమంత్రులు ఆరోపించారు. పార్లమెంటరీ వ్యవహారాలకు భంగం కలిగించిన ప్రతిపక్షాలు దేశప్రజలకు క్షమాపణలు చెప్పాలని పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రభుత్వం బిల్లులను పాస్ చేస్తే మరింత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని విపక్షాలు తమను బెదిరించాయని వెల్లడించారు. ఓబీసీ, ఇన్సూరెన్స్ బిల్లులను పాస్ చేసిన తర్వాత ఇతర బిల్లులేవైనా ప్రవేశపెడితే పార్లమెంటులో తీవ్రపరిణామాలు సృష్టిస్తామని హెచ్చరించాయని చెప్పారు. అందుకే రెండు రోజులు ముందుగానే వర్షాకాల సమావేశాలను ముగించాల్సి వచ్చిందని తెలిపారు.

click me!