
భారతదేశం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్దమవుతున్న వేళ.. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీకి 25 కి.మీల దూరంలో ఆర్మీ క్యాంపుపై దాడికి ప్రయత్నించారు. ఈ ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. దర్హల్ ప్రాంతంలోని పర్గల్‌లోని ఆర్మీ క్యాంప్‌పై దాడి చేసేందుకు ఉగ్రవాదులు యత్నించారు. గురువారం తెల్లవారుజామున ఆర్మీ క్యాంప్ ఫెన్సింగ్ దాటుకుని లోపలకు చొరబడేందుకు యత్నించారు. భారీ కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుపెట్టగా.. ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు.
ఈ ఘటనతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు.. ఘటన స్థలానికి అదనపు బలగాలను పంపారు. 16 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మంజీందర్ సింగ్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ ఎన్‌కౌంటర్ ఐదుగురు జవాన్లు గాయపడ్డారని.. వారిలో ఒక అధికారి కూడా ఉన్నారని ఆర్మీ వర్గాలు తెలిపాయి. గాయపడినవారిని వైద్య చికిత్స కోసం తరలించారు. ఇక, ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతుందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.