
ఉగ్రవాద నిధుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఉగ్రవాది యాసిన్ మాలిక్‌ను హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న యాసిన్ మాలిక్ ఇటీవల అమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యాసిన్ మాలిక్ రక్తపోటు స్థాయిలలో హెచ్చుతగ్గుల కారణంగా అతడిని జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడిని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేర్పించినట్టుగా జైలు అధికారులు తెలిపారు. అయితే అతడు తనకు చికిత్స చేయవద్దని వైద్యులకు లేఖ రాశాడానికి జైలు వర్గాలు తెలిపారు.
ఇక, తన కేసును సక్రమంగా విచారించడం లేదని ఆరోపిస్తూ మాలిక్ జూలై 22న నిరాహార దీక్ష ప్రారంభించారు. అతన్ని మొదట జైలులో హై-రిస్క్ సెల్‌లో ఏకాంత నిర్బంధంలో ఉంచారు. తర్వాత జైలులోని మెడికల్ ఇన్వెస్టిగేషన్ గదికి తరలించారు. అక్కడ అతనికి ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్‌పై ఉంచారు. వైద్యులు అతని ఆరోగ్య స్థితిని నిరంతరం పర్యవేక్షించారు.
ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో మాలిక్‌ను ఈ ఏడాది మే నెలలో NIA ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించింది. మే 25న జీవిత ఖైదు విధించింది. కోర్టు అతనికి ₹ 10 లక్షల జరిమానా కూడా విధించింది. అంతకుముందు.. మే 10వ తేదీన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఉన్న ఆరోపణలతో సహా అన్ని ఆరోపణలకు సంబంధించి మాలిక్ నేరాన్ని అంగీకరించాడు.
ఇక, యాసిక్ మాలిక్.. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడం, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడినట్లు తేలింది.మాలిక్.. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 120-బి (నేరపూరిత కుట్ర), 124-ఏ (దేశద్రోహం) కింద అభియోగాలను ఎదుర్కొన్నాడు.