ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిర ప్రారంభోత్సవ వేళ అయోధ్యలో ఉగ్రవాద అనుమానితుల కదలికలు కలకలం రేపుతున్నాయి.
అయోధ్య : ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన సెలెబ్రిటీలు జనవరి 22న ఒక్కచోటికి చేరనున్నారు. అతిరథ మహారథుల సమక్షంలో రామ జన్మభూమి అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మందిర ప్రాణప్రతిష్ట (ప్రారంభోత్సవ) కార్యక్రమం జరగనుంది. ఇలాంటి సమయంలో అయోధ్యలో ముగ్గురు ఉగ్రవాద అనుమానితుల అరెస్ట్ ఒక్కసారిగా కలకలం రేపింది. ఇప్పటికే అయోధ్యను తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు గురువారం రాత్రి చేపట్టిన తనిఖీల్లో ముగ్గురు అనుమనితులు పట్టుబడ్డారు.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా యూపీ పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేసాయి. రామమందిర ప్రాంగణం, ప్రముఖులు బసచేసే ప్రాంతాల్లోనే కాదు అయోధ్య మొత్తం బద్రతా బలగాల పహారా కాస్తున్నాయి. ఈ క్రమంలోనే ముగ్గురు అనుమానితులను యూపీ యాంటి టెర్రరిస్ట్ స్వాడ్ అదుపులోకి తీసుకుంది. వీరికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలేమైనా వున్నాయేమోనని అనుమానిస్తున్నారు.
పట్టుబడిన వారిలో ఒకరు రాజస్థాన్ కు చెందిన ధర్మవీర్ గా గుర్తించారు. మిగతా ఇద్దరు అనుమానితుల వివరాలు తెలియాల్సి వుంది. వీరు అయోధ్యకు ఎందుకు వచ్చారు? ఏమైనా అలజడి సృష్టించేందుకు కుట్రలు పన్నారా? వీరి వెనకున్నది ఎవరు? తదితర విషయాలు తెలుసుకునేందుకు ఏటిఎస్ తో పాటు వివిధ విభాగాలకు చెందిన భద్రతా సిబ్బంది విచారణ చేపట్టారు.
Also Read Ayodhya: అయోధ్యకు వందకుపైగా విమానాలు.. యూపీలోని ఐదు ఎయిర్‌పోర్టుల్లో వీఐపీల విమానాల పార్కింగ్
ఇదిలావుంటే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమంకోసం ఇప్పటికే భద్రతా చర్యలు చేపట్టారు. పదివేలమందికి పైగా రాష్ట్ర, కేంద్ర బలగాలు అయోధ్యలో విధులు నిర్వహిస్తున్నారు. 100 మందికి పైగా డిఎస్పీలు, 320 మంది సిఐలు, 800 మంది ఎస్సైలు, వేలాదిమంది కానిస్టేబుల్స్ అయోధ్యలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ భద్రతా వ్యవహారాలను యూపీ స్పెషల్ డిజిపి ప్రశాంత్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు.
ఇక హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే దాదాపు 10వేలకు పైగా సిసి కెమెరాలను అయోధ్య మొత్తం ఏర్పాటుచేసారు. అలాగే డ్రోన్ కెమెరాలను కూడా భద్రత కోసం ఉపయోగిస్తున్నారు. ఇక ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు ఎయిర్ ఫోర్స్ ను సిద్దం చేసారు. ఇలా అయోధ్యలో చీమ చిటుక్కుమన్నా తమకు తెలిసేలా యూపీ పోలీసులు, కేంద్ర బలగాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.