
Southwest Monsoon 2022: తెలంగాణలోకి నైరుతి ఆగమనం మరింత ఆలస్యం కానున్నది. గత మూడు రోజుల కిత్రమే నైరుతి రుతుపవనాలు కేరళలో అడుగు పెట్టినా.. రాష్ట్రాన్ని మాత్రం కాస్త ఆలస్యంగా రానున్నాయి. తొలుత ఈ నెల 10 వరకు రాష్ట్రంలో నైరుతి ఆగమనం జరుగుతుందని ప్రకటించిన వాతావరణ శాఖ .. ప్రస్తుతం రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు లేవని, కావున మరో మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనాలు తెలంగాణ ప్రవేశిస్తాయని, అంటే ఈ నెల 12 నాటికి రాష్ట్రంలోకి రుతుపవానాలు అడుగుపెట్టి.. విస్తరించనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.
నైరుతి ఆగమనంతో రాష్ట్రంలో వరుసగా భారీ వర్షాలు పడే అవకాశముంటుందని పేర్కొంది. రుతు ఆగమనంతో.. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం చల్లబడునుంది ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని చెప్పారు. అదే సమయంలో వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
గత ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళలోకి ప్రవేశించగా.. కేవలం నాలుగు రోజుల్లోనే తెలంగాణాలోకి అడుగు పెట్టాయి. కానీ, ఈ ఏడాది పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. కేరళలో మే నెలాఖరునే నైరుతి ఆగమనం జరిగినా.. ఇప్పటి వరకు తెలంగాణలో రుతుపవనాలు అడుగుపెట్టక పోవడం గమనార్హం.
మరో వైపు.. తొలకరి పలకరింపు కోసం అన్నదాతలు సిద్దంగా ఉన్నారు. ఒకసారి వర్షం పడితే.. వ్యవసాయ పనులను మరింత వేగవంతం చేస్తారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది సాధారణం కంటే.. ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశముంది. అంటే..106 శాతానికి పైనే వర్షపాతం నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. గతేడాది.. నైరుతి కాలంలో తెలంగాణలో 104.47 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం కంటే.. అధిక వానలు పడుతాయని అంచనా వేస్తుంది.
కాగా.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే నాలుగు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలోని పలు చోట్ల బుధవారం తేలికపాటి జల్లులు కురిశాయి. ఇక ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. రాష్ట్రంలో నమోదైన నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. బుధవారం ఆదిలాబాద్‌లోని జైనథ్లో 45.2 డిగ్రీలు, జగిత్యాలలోని ఐలాపూర్‌లో 44.9 డిగ్రీలు, ఖమ్మంలోని తిమ్మారావుపేటలో 44.2 డిగ్రీలు, సూర్యాపేటలోని తొగర్రాయిలో 44.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.