
ప్రతి ఏడాది ఎంతో మంది మహిళలు గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఆ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పించేందుకు పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా క్వాడ్రివాలెంట్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్‌ను (Quadrivalent Human Papillomavirus vaccine) అభివృద్ది చేసింది. పూర్తిగా స్వదేశీ స్వదేశీ పరిజ్ఞానంతో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ది చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ మార్కెట్ అనుమతి కోరుతూ సీరమ్ ఇన్‌స్టిట్యూట్.. దేశ ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసినట్లు అధికారిక వర్గాలు బుధవారం తెలిపాయి. సీరమ్ ఇనిస్టిట్యూట్.. బయోటెక్నాలజీ విభాగం మద్దతుతో ఫేజ్ 2,3 క్లినికల్ ట్రయల్‌ని పూర్తి చేసిన తర్వాత మార్కెట్ ఆథరైజేషన్ కోసం దరఖాస్తు చేసిందని.. దేశంలో త్వరగా అందుబాటులో ఉండేలా చూస్తామని వారు తెలిపారు.
డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI)కి చేసిన దరఖాస్తులో.. CERVAVAC వ్యాక్సిన్ అన్ని టార్గెటెడ్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ రకాలకు వ్యతిరేకంగా బేస్‌లైన్ కంటే దాదాపు 1000 రెట్లు ఎక్కువ బలమైన యాంటీబాడీ ప్రతిస్పందనను ప్రదర్శించిందని SII డైరెక్టర్ (ప్రభుత్వ మరియు నియంత్రణ వ్యవహారాలు) ప్రకాష్ కుమార్ సింగ్ అని పేర్కొన్నారు. అన్ని మోతాదు, వయస్సు సమూహాలలో ఇది నిరూపితమైందని చెప్పారు. ఇక, ఈ వ్యాక్సిన్ డేటా, ఉపయోగాన్ని సమీక్షించడానికి NTAGI బుధవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో.. డాక్టర్ ఎన్‌కే అరోరా అధ్యక్షతన HPV యొక్క వర్కింగ్ గ్రూప్ ముందు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఒక ప్రజెంటేషన్ చేసినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు ప్రతి ఏడాది లక్షలాది మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో పాటు కొన్ని ఇతర క్యాన్సర్‌లతో బాధపడుతున్నారని.. మరణాల నిష్పత్తి కూడా చాలా ఎక్కువగా ఉందని ప్రకాష్ కుమార్ సింగ్ దరఖాస్తులో పేర్కొన్నారు. "అలాగే.. ప్రస్తుతం మన దేశం HPV వ్యాక్సిన్ కోసం పూర్తిగా విదేశీ తయారీదారులపై ఆధారపడటం గమనార్హం. మా గ్రూప్ యొక్క philosophyకి అనుగుణంగా, మా CEO డాక్టర్ అదార్ సి పూనావాలా నాయకత్వంలో.. అధిక నాణ్యత గల 'మేడ్ ఇన్ ఇండియా' వ్యాక్సిన్‌లు సరసమైన ధరలో మన దేశంతో పాటుగా ప్రపంచంలోని ప్రజలకు పెద్ద ఎత్తున లభించేలా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచడానికి మా ప్రయత్నం’’ అని ప్రకాష్ కుమార్ సింగ్ చెప్పారు.
‘‘ప్రాణాలను రక్షించే ఇతర అనేక స్వదేశీ వ్యాక్సిన్‌ల మాదిరిగానే.. భారతదేశపు మొట్టమొదటి ప్రాణాలను రక్షించే qHPV స్వదేశీ టీకా కోసం మన దేశాన్ని 'ఆత్మనిర్‌భర్'గా మార్చడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఇది మన గౌరవప్రదమైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ''VOCAL FOR LOCAL', 'MAKING IN INDIA FOR THE WORLD'కల నెరవేరుస్తుంది. హ్యూమన్ పాపిల్లోమావైరస్ (టైప్ 6, 11, 16 అండ్ 18) వ్యాక్సిన్ రీకాంబినెంట్ వల్ల వచ్చే క్యాన్సర్‌ల నివారణను నిర్ధారిస్తుంది’’ అని ప్రకాష్ కుమార్ సింగ్ దరఖాస్తులో పేర్కొన్నట్టుగా తెలిసింది. ఇదిలా ఉంటే.. భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ 15 నుంచి 44 సంవత్సరాల మధ్య మహిళల్లో అత్యంత తరచుగా వచ్చే క్యాన్సర్లలో రెండవ స్థానంలో ఉంది.