నేను చెప్పేది హైదరాబాద్‌లోని ఫ్రెండ్స్‌కు నచ్చకపోవచ్చు: బెంగళూరులో వరదలపై కేటీఆర్

Published : Sep 06, 2022, 09:45 AM IST
నేను చెప్పేది హైదరాబాద్‌లోని ఫ్రెండ్స్‌కు నచ్చకపోవచ్చు: బెంగళూరులో వరదలపై కేటీఆర్

సారాంశం

కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. అనేక ప్రాంతాల్లో జల దిగ్భంధంలో చిక్కుకకుపోయాయి. బెంగళూరులో నెలకొన్న పరిస్థితులపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. వాతావరణ మార్పుల వినాశకరమైన పరిణామాల నుంచి ఏ భారతీయ నగరమూ తప్పించుకోలేదని ట్వీట్ చేశారు.   

కర్ణాటక రాజధాని బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. అనేక ప్రాంతాల్లో జల దిగ్భంధంలో చిక్కుకకుపోయాయి. పలు చోట్ల రోడ్లు నదులను తలపిస్తున్నాయి. దీంతో పలు మార్గాల్లో కి.మీ మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు ట్రాఫిక్‌లో చిక్కుకుని ఆఫీసులకు ఆలస్యంగా చేరుకోవడంతో.. ఐటీ సంస్థలకు రూ. 225కోట్ల నష్టం వాటిలినట్టుగా బెంగళూరు ఔటర్‌ రింగ్‌రోడ్‌ కంపెనీస్‌ అసోసియేషన్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. మరోవైపు వరద నీటిలో చిక్కుకుపోయిన బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు ప్రాంతాలకు అవసరమైన వస్తువులను సరఫరా చేయడానికి పడవలను, ట్రాక్టర్లను వినియోగించాల్సి వచ్చింది. 

బెంగళూరులో నెలకొన్న పరిస్థితులపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. వాతావరణ మార్పుల వినాశకరమైన పరిణామాల నుంచి ఏ భారతీయ నగరమూ తప్పించుకోలేదని ట్వీట్ చేశారు. వేగవంతమైన పట్టణీకరణ సవాళ్లను పరిష్కరించడానికి పట్టణ ప్రణాళిక, పరిపాలనలో సాహసోపేతమైన సంస్కరణలను ప్లాన్ చేయాలని  కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి  హర్దీప్ సింగ్ పూరిని కోరారు. 

 


‘‘నీటితో నిండిన బెంగళూరును అపహాస్యం చేస్తున్న వారందరికీ..వేగవంతమైన అర్బనైజేషన్, సబ్-అర్బనైజేషన్‌తో రాష్ట్రాలు, దేశం అభివృద్ధిని నడిపించే మన నగరాలు మన ప్రాథమిక ఆర్థిక యంత్రాలు. అందుకు తగినట్టుగా నగరాలను అప్‌గ్రేడ్ చేయడానికి తగినన్ని నిధులు కేటాయించకపోతే మౌలిక సదుపాయాలు కుప్పకూలిపోతాయి. ఈ రోజు దేశంలోని ఏ నగరం (నా రాష్ట్ర రాజధాని నగరంతో సహా) వాతావరణ మార్పుల వినాశకరమైన పరిణామాలకు అతీతంగా లేదు. భారతదేశం వృద్ధిని కొనసాగించాలంటే.. మన మౌలిక సదుపాయాలలో సమూలమైన అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమగ్ర మూలధన కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది’’ అని కేటీర్ ట్వీట్ చేశారు. 

ఈ సమస్యలను పరిష్కరించడానికి సమూలమైన చర్యలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.  ‘‘మన పట్టణ ప్రణాళిక, పాలనలో సాహసోపేతమైన సంస్కరణలు అవసరం. సాంప్రదాయిక ఆలోచనా ధోరణి, రాడికల్ విషయాల నుండి దూరంగా ఉండండి. నాణ్యమైన రోడ్లు, నీరు, గాలి, నీటి నిర్వహణ సదుపాయాలను కల్పించడం కష్టమైన పని కాదు. ఇందుకు అవసరమైన మూలధనం కోసం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు ప్లాన్ చేయండి’’ అని కోరారు. 

గతంలో ఇలాంటి పరిస్థితులపై కొందరు బెంగళూరు నాయకులు హైదరాబాద్‌ వాసులను విమర్శించారని చెప్పారు. అయితే ఒకరి అనుభవాల నుంచి మరొకరు నేర్చుకుని సమిష్టి సంకల్పం యొక్క శక్తిని చూపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘‘హైదరాబాద్‌లోని కొంతమంది స్నేహితులకు నేను చెప్పేది నచ్చదని నాకు తెలుసు. ఎందుకంటే గతంలో ఇలాంటి పరిస్థితుల్లో కొందరు బెంగళూరు నాయకులు మనల్ని తిట్టారు. కానీ మనం ఒక దేశంగా ఎదగాలంటే.. మనం ఒకరి నుండి మరొకరు నేర్చుకోవాలి’’ అని కేటీఆర్ అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ
Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu