బీజేపీ ఎంపీ అరవింద్ నివాసం మీద టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడాన్ని ఆ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఖండించారు. సహనంగా ఉంటే చేతగానితనం అనుకోవద్దని, తాము బరిలోకి దిగితే తట్టుకోలేరని హెచ్చరించారు.
హైదరాబాద్ : తెలంగాణలో ఒక్కసారిగా పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర విమర్శలు దాడుల వరకూ వెళ్ళింది తెలంగాణ రాజకీయం. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ ఎంపీ అరవింద్ ఆరోపణలు చేయడంతో కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక, టిఆర్ఎస్ శ్రేణులు అరవింద్ ఇంటిని ముట్టడించి ఇంట్లో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. టిఆర్ఎస్ ఘటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సైతం స్పందించారు.
ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ భౌతిక దాడులు దిగి రౌడీయిజం చేస్తారా? అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేని దద్దమ్మలు దాడులతో ప్రశ్నించే గొంతు నొక్కాలనుకుంటున్నారు. బిజెపి సహనాన్ని చేతగానితనంగా అనుకోవద్దు.. మా కార్యకర్తలు బరిలోకి దిగితే తట్టుకోలేరు.. అంటూ వార్నింగ్ ఇచ్చారు.
undefined
ఎంపీ అరవింద్ ఇంటి పై దాడి ఘటనపై డీకే అరుణ కూడా స్పందించారు. డీకే అరుణ మాట్లాడుతూ.. దాడికి కారణమైన కవితపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు టిఆర్ఎస్ కార్యకర్తల దాడి నేపథ్యంలో హైదరాబాద్, ఆర్మూర్ లలో అరవింద్ నివాసాల వద్ద పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు.
దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయ్, కుల అహంకారంతో దాడి: కవితపై నిజామాబాద్ ఎంపీ అరవింద్
ఇదిలా ఉండగా, టి ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంట్లో ఫర్నిచర్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. హైదరాబాద్ లోని ఎంపీ అరవింద్ నివాసంలోకి దూసుకువచ్చిన టిఆర్ఎస్ కార్యకర్తలు ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. టిఆర్ఎస్ కార్యకర్తలు సుమారు 20మంది దాకా ఇంట్లోకి వచ్చి దేవుడి ఫోటోలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. మరోవైపు ఎంపీ అరవింద్ నివాసంలో ఉన్న కారుపై కూడా టిఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగారు ఈ కారు అద్దాలు దెబ్బతిన్నాయి.
ఎంపీ అరవింద్ ఇంటికి సమీపంలో టిఆర్ఎస్ కార్యకర్తలు గుమికూడారు. టిఆర్ఎస్ కార్యకర్తలు ఎంపీ ఇంటి ముందు ఆందోళనకు దిగిన విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. టిఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే టీఆర్ఎస్ శ్రేణుల్లో ఒక్కసారిగా గేట్లను తోసుకుంటూ ఇంట్లోకి ప్రవేశించారని నివాసంలో ఉన్న వారు మీడియాకు తెలిపారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటి ముందు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
దీంతో అరవింద్ ఇంటి ముందు ఆందోళనకు దిగిన టీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న నిజామాబాదులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అరవింద్.. కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. గతంలో కూడా కవితపై ఎంపీ అరవింద్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని టిఆర్ఎస్ శ్రేణులు విరుచుకు పడ్డాయి.