
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థిత్వం గురించి పోటీ తీవ్రతరమవుతుండగా.. బీజేపీలో అభ్యర్థుల ఖరారు హాట్ టాపిక్‌గా మారింది. టికెట్ దక్కని వారు తిరుగుబాటుకూ తెరలేపారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్లనూ పక్కనపెట్టి కొత్త వారికి బీజేపీ అవకాశం ఇవ్వడం అక్కడ సీనియర్ నేతల్లో ఆగ్రహం రగిల్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది నుంచి గతంలో కంటే ఎక్కవ ఎంపీ సీట్లను గెలవాలని బీజేపీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రయోగాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే అక్కడి ఎన్నికల్లో ప్రచారానికి ఇతర రాష్ట్రాల నుంచి నేతలను దింపింది.
తెలంగాణ నుంచి బీజేపీ నేతలను కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి కేటాయించింది. వారికి పలు బాధ్యతలు అప్పగించింది. మొత్తం 13 రాష్ట్రాల నుంచి నేతలను ఎంపిక చేసింది. కాగా, 20 అసెంబ్లీ స్థానాల్లో ఇన్‌చార్జీలుగా తెలంగాణ నేతలను నియమించే నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ తెలంగాణ బీజేపీ నేతలు సందడి చేయనున్నారు. లక్ష్మణ్, అర్వింద్, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, రఘునందన్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, గరికపాటి, బండ కార్తీకరెడ్డి, కొల్లి మాధవి, ఎస్ కుమార్‌లను కర్ణాటకలో ప్రచారానికి ఎంచుకుంది. వీరంతా వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు తీసుకోవాలి. అంతేకాదు, లక్ష్మణ్‌తోపాటు మరికొందరికి వారికి కేటాయించిన నియోజకవర్గంతోపాటు ఆ జిల్లాలోని మరో 5 నియోజకవర్గాల మధ్య సమన్వయ బాధ్యతలనూ బీజేపీ అగ్రనాయకత్వం అప్పగించింది.
కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ అసెంబ్లీ స్థానాలకు 224 మందిని ఇతర రాష్ట్రాల నుంచి బాధ్యులుగా నియమించింది.
ఇందుకేనా?
దక్షిణ భారత దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. ఈ రాష్ట్రాన్ని ఆ పార్టీ ఎట్టిపరిస్థితుల్లో పోగొట్టుకోవాలని అనుకోవడం లేదు. పైపెచ్చు 2024 సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది నుంచి ఎంపీ స్థానాలు తగ్గితే ఆ లోటును దక్షిణాది స్థానాలతో పూడ్చుకోవాలని భావిస్తున్నది. అందుకే బీజేపీ దక్షిణ భారత దేశంలపై ఫోకస్ పెట్టింది. దీనితోపాటు 2024 సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ ఈ రాష్ట్రంలోనే కొత్త ప్రయోగాలు చేపడుతున్నట్టు తెలుస్తున్నది.
కర్ణాటక బీజేపీ నేతలపై స్థానికంగా వ్యతిరేకత నెలకొని ఉంది. అవినీతి ఆరోపణలూ జాస్తిగానే ఉన్నాయి. అక్కడ ఎన్నికలు సీఎం క్యాండిడేట్ ముఖం చూపించి పోరాడేలా లేదు. తొలిగా సీఎంగా చేసిన బీఎస్ యెడియూరప్పను పక్కకు దింపి బసవరాజు బొమ్మైని బీజేపీ సీఎంగా చేసిన సంగతి తెలిసిందే. అంతో ఇంతో యెడియూరప్పకే ప్రజాధారణ ఉన్నది గానీ, ఆ మేరకు బొమ్మైకి ఆదరణ లేదన్నది పార్టీ అభిప్రాయం అన్నట్టు తెలుస్తున్నది. అందుకే కర్ణాటకలో స్థానిక నేతలు, సీఎం ముఖం కాకుండా.. మోడీ ఫేస్ వ్యాల్యూతోనే ఎన్నికలను గెలవాలని భావిస్తున్నట్టు సమాచారం.
అందుకే స్థానిక నేతలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి రప్పించిన నేతలతో ప్రచారం విరివిగా చేపించాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అవినీతి ఆరోపణలు, వ్యతిరేకతను ఈ విధానంలో కొంత తగ్గించవచ్చనేది పార్టీ ఆలోచనగా అర్థం అవుతున్నది. దీనికితోడు సార్వత్రిక ఎన్నికలు వస్తున్న తరుణంలో పార్టీ క్యాడర్‌నూ అందుకు సమాయత్తం చేయడానికి, ఈ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధం చేయడమూ ఈ నిర్ణయం వెనుక కారణంగా తెలుస్తున్నది. తెలంగాణలోనూ ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కర్ణాటక ఎన్నికలో ప్రచార మెళకువలు తెలంగాణలోనూ ఈ రాష్ట్ర నేతలకు ఉపకరిస్తాయనే ఆలోచనలు కూడా ఉన్నట్టు అర్థం అవుతున్నది.
జేడీఎస్ కోసం బీఆర్ఎస్ పార్టీ కూడా తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రచారం విస్తృతంగా చేయనుంది. బీజేపీ కూడా తెలంగాణ నేతలను ప్రచారంలోకి దింపితే తెలుగు ఓటర్లను కాపాడుకునే అవకాశాలు ఉంటాయి.