
లక్నో: పోలీసు కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో శనివారం ఉదయం ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీరు మరణించాడు. తనిఖీల సందర్భంగా టెక్కీ ఎస్ యూవీ వాహనాన్ని అపడానికి నిరాకరించాడని, దాంతో పోలీసు కానిస్టేబుల్ కాల్పులు జరిపాడని అంటున్నారు. మృతుడిని వివేక్ తివారీగా గుర్తించారు. లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స పొందతూ అతను మరణించాడు.
శనివారం తెల్లవారు జామున 1.30 గంటల సమయంలో లక్నోలోని గోమతి నగర్ ఎక్స్ టెన్షన్ ఏరియాలో ఆ సంఘటన చోటు చేసుకుంది. తివారీ తన మాజీ సహోద్యోగిని సానా ఖాన్ తో కారులో ఉన్నాడని, పోలీసులను చూడగానే పారిపోవడానికి ప్రయత్నించి ఓ గోడకు కారును ఢీకొట్టాడని అంటున్నారు.
ప్రశాంత్ కుమార్, సందీప్ కుమార్ అనే పోలీసు కానిస్టేబుళ్లు కారును ఆపాల్సిందిగా సూచించారు. పారిపోవడానికి ప్రయత్నిస్తూ తివారీ తన కారుతో పోలీసు గస్తీ బైక్ ను ఢీకొట్టి ఆ తర్వాత గోడను ఢీకొట్టాడని పోలీసులు అంటున్నారు.
అయితే, సానా ఖాన్ వాదన మరో విధంగా ఉంది. తమ కారుకు పోలీసులు అడ్డంగా వచ్చి, బలవంతంగా ఆపడానికి ప్రయత్నించారని, అడ్డుపడినవారు పోలీసులు అనుకోలేదని, దాంతో తివారీ కారును ఆపలేదని ఆమె చెప్పారు.
ఓ వ్యక్తి చేతిలో లాఠీ ఉందని, ఎదురుగా ఉన్న వ్యక్తి వద్ద రివాల్వర్ ఉందని, రివాల్వర్ తో అతను కాల్పులు జరిపాడని, తుపాకి గుండు విండ్ స్క్రీన్ ను తాకి తివారీకి తాకిందని ఆమె వివరించారు.
మీడియాతో మాట్లడడానికి ఆమె నిరాకరించారు. తాను ప్రస్తుతం మాట్లాడే స్థితిలో లేనని చెప్పింది. తప్పు చేసినవారికి శిక్ష పడాలని, వాస్తవాన్ని దాచే ప్రయత్నమేదీ తాను చేయడం లేదని అన్నారు.
పోలీసును అదుపులోకి తీసుకున్నామని, తమ కానిస్టేబుల్ అనుమానాస్పదమైన చర్య జరుగుతుందని భావించి కాల్పులు జరిపాడని, దాంతో వాహనం డ్రైవర్ గాయపడ్డాడని, పోలీసులను చూసి అతను పారిపోయే ప్రయత్నంలో కారును గోడకేసి గుద్దాడని, దాంతో తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని, అతను ఎలా చనిపోయాడనేది పోస్టు మార్టం నివేదికలో తేలుతుందని లక్నో పోలీసు చీఫ్ కళానిధి నైథాని అన్నారు.
దాదాపు తెల్లవారు జామున 2 గంటలకు లైట్స్ ఆఫ్ చేసిన అనుమానాస్పదమైన కారు కనిపించిందని, తాను దగ్గరికి వెళ్లానని, అప్పుడు డ్రైవర్ (వివేక్ తివారీ) తనపైకి కారును తనపై నుంచి నడిపించడానికి మూడుసార్లు ప్రయత్నించాడని కానిస్టేబుల్ ప్రశాంత్ కుమార్ అంటున్నారు. ఆత్మరక్షణ కోసం తాను వెంటనే కాల్పులు జరిపానని చెప్పారు.
తన భర్తపై కాల్పులు జరిపే హక్కు కానిస్టేబుళ్లకు లేదని, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తన వద్దకు వచ్చి తన భర్తను ఎందుకు చంపారో చెప్పాలని వివేక్ తివారీ భార్య కల్పన అంటున్నారు.