ఉద్యోగులకు బెంజ్ కార్లు గిఫ్ట్

By ramya neerukondaFirst Published Sep 29, 2018, 12:13 PM IST
Highlights

వీరికి ఒక్కొక్కరికి రూ.3 కోట్ల మెర్సిడెస్‌ బెంజ్‌ జీఎల్‌ఎస్‌ ఎస్‌యూవీ బహుకరించారు ఆ వజ్రాల వ్యాపారి. 

ఓ యజమాని.. తన సంస్థలో పనిచేసే ఉద్యోగులకు బెంజ్ కార్లు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆయనే సూరత్ కి చెందిన వజ్రాల వ్యాపారి సావ్జి దోలకియా. ప్రతి సంవత్సరం తమ ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు ఇస్తూ వార్తల్లో నిలిస్తూ ఉండే ఈయన ఈ సారి కూడా తమ కంపెనీ ఉద్యోగులకు భారీ బహుమతిని అందజేశారు.

హరికృష్ణ డైమండ్స్ ఎక్స్‌పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్న ముగ్గురు ఉత్తమ ఉద్యోగులకు బెంజ్ కార్లను బహుమతి ఇచ్చారు. ఈ సీనియర్‌ ఉద్యోగులు కంపెనీలో చేరి 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ.3 కోట్ల మెర్సిడెస్‌ బెంజ్‌ జీఎల్‌ఎస్‌ ఎస్‌యూవీ బహుకరించారు ఆ వజ్రాల వ్యాపారి. 

మెర్సిడెస్‌ బెంజ్‌ జీఎల్‌ఎస్‌ 350డీ ఎస్‌యూవీ ఆన్‌-రోడ్డు ధర ప్రస్తుతం సూరత్‌లో కోటి రూపాయలుగా ఉంది. నీలేష్ జాదా (40), ముఖేష్ చందర్ (38), మహేష్ చంద్‌పర(43)లు చిన్న వయసులోనే అంటే 13 లేదా 15 ఏళ్లు వయసున్న సమయంలో ఈ వజ్రాల వ్యాపారి కంపెనీలో చేరారు. డైమాండ్స్‌ను కట్‌ చేయడం నుంచి తమ పనిని నేర్చుకున్న ఈ ఉద్యోగులు, ప్రస్తుతం కంపెనీలో సీనియర్‌ ఉద్యోగులని, ఎంతో నమ్మకమైన ఉద్యోగులుగా వీరు నిలుస్తున్నట్టు దోలకియా చెప్పారు. సూరత్‌లో ఈ బహుమతుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ పటేల్ చేతుల మీదుగా ఉద్యోగులకు ఈ బహుమతులను బహుకరించారు. ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ గవర్నర్ సైతం హాజరయ్యారు. 

దోలకియా ఉద్యోగులకు కానుకలు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. 2016లో దీపావళి కానుకగా మొత్తం 1716 మంది ఉద్యోగులకు ఎంపిక చేసి బహుమతులు ఇచ్చారు. అందుకోసం ఏకంగా రూ.51 కోట్లు ఖర్చు చేశారు. కొందరికి ప్లాట్లు ఇస్తే, మరికొందరికి కార్లు ఇచ్చారు. ఇంకొంత మందికి బంగారు ఆభరణాలు, వజ్రాలు గిఫ్ట్‌గా ఇచ్చారు. హరికృష్ణ డైమండ్స్ ఎక్స్‌పోర్ట్ కంపెనీలో 5500 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కంపెనీ వార్షిక టర్నోవర్‌ రూ.6000 కోట్లుగా ఉంది. 1977లో కేవలం రూ.12.5 బస్సు టిక్కెట్‌ పైసలతో మాత్రమే సూరత్‌ వచ్చిన దోలకియా, ఇప్పుడు వజ్రాల వ్యాపారిగా రూ.6000 కోట్ల టర్నోవర్‌కు పడగెత్తారు.  

click me!