
తమిళనాడులో ( Tamil Nadu) ఓ ఉపాధ్యాయుడు భగవద్గీతను (Bhagavad Gita) తప్పుబడుతూ... బైబిల్‌ను (Bible) పొగుడుతూ పాఠాలు చెప్పినట్టు ఆరో తరగతి విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. కన్యాకుమారి జిల్లాలో (Kanyakumari district) కన్నట్టువిలైలోని (Kannattuvilai) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన జరిగింది. కుట్లు, టైలరింగ్‌పై శిక్షణ ఇస్తున్న ఓ టీచర్ విద్యార్థుల మతం మార్చేందుకు ప్రయత్నించారని, హిందూ దేవుళ్లపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కన్నట్టువిలై ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థిని తన టీచర్ బీట్రైస్ తంగం (Beatrice Thangam) హిందువుల (hindus) మత విశ్వాసాల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు తల్లిదండ్రులకు చెప్పింది. అంతేకాకుండా క్రైస్తవ మతం గురించి గొప్పగా చెప్పారంటూ ఆరోపించింది. అలాగే భగవద్గీత చెడ్డదని, బైబిల్లో మంచి విషయాలు ఉన్నాయని చెప్పారని తల్లిదండ్రులకు చెప్పింది. విద్యార్థులను బైబిల్ చదవమని టీచర్ చెప్పారని, అలాగే శిక్షణ సమయంలో అందరితో శిలువ గుర్తును కుట్టించారని చెప్పింది. అలాగే లంచ్ బ్రేక్ సమయంలో వారిని మోకరిల్లి, చేతులు జోడించి క్రైస్తవ ప్రార్థనలు చేయమని బలవంతం చేశారని ఆ విద్యార్ధిని తెలిపింది.
దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు, హిందూ మున్నాని సంఘ సభ్యులతో పాఠశాలకు వెళ్లి ఆరా తీశారు. అంతకుముందు పోలీసులకు కూడా సమాచారం అందించారు. అక్కడి పిల్లలని విషయం అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆ టీచర్‌పై అధికారులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థి స్వయంగా చెప్పడంతో విద్యాశాఖాధికారులు నష్ట నివారణా చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఆ టీచర్ బీట్రైస్ తంగంని సస్పెండ్ చేశారు.
ఇకపోతే.. కొద్దిరోజుల క్రితం మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు యూనివర్సిటీలోని మెడికల్ స్కూల్ ఫ్యాకల్టీ మెంబర్ డాక్టర్ జితేంద్ర కుమార్‌కు (Dr Jitendra Kumar) అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) (Aligarh Muslim University (AMU) షోకాజ్ నోటీసు (show-cause notice) జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రొఫెసర్ క్లాస్‌లో భాగంగా ఒక స్లైడ్ షోను చూపించాడని, అందులో ఆయన "అత్యాచారానికి సంబంధించి పౌరాణిక ప్రస్తావన" తెచ్చాడని విద్యార్ధులు ఆరోపించారు.
భారత్‌లో అత్యాచారం, దాని చారిత్రక, మతపరమైన సూచనల గురించి ప్రొఫెసర్ బోధించారని వారు తెలిపారు. లెక్చర్ ఇస్తున్న సమయంలో స్లైడ్‌లో ‘‘బ్రహ్మ తన కూతురిపై అత్యాచారం చేసిన కథ’’ అంటూ చెప్పారని విద్యార్ధులు చెప్పారు. తన భార్యను మారువేషంలో అత్యాచారం చేసినందుకు ఇంద్రుడికి రుషి గౌతముడు శిక్ష వేయడం, జలంధరుడి భార్యపై శ్రీమహా విష్ణువు అత్యాచారం చేయడం గురించి ప్రొఫెసర్ వివరించాడు. అలాగే నిర్భయ అత్యాచారం, మధుర అత్యాచారం కేసు, హిందూ సంప్రదాయంలోని రకరకాల వివాహాల గురించి కూడా జితేంద్ర కుమార్ తెలిపినట్లు విద్యార్ధులు ఆరోపించారు. దీనిపై వర్సిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.