తమిళనాడులో మరో ఆడియో క్లిప్ ట్వీట్ చేసిన బీజేపీ స్టేట్ చీఫ్ అన్నమళై

By Mahesh KFirst Published Apr 26, 2023, 5:34 AM IST
Highlights

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమళై మరో ఆడియో క్లిప్ విడుదల చేశారు. మంత్రి పీటీఆర్ వ్యాఖ్యలుగా చెబుతున్న ఒక ఆడియో క్లిప్ ఇప్పటికే విడుదల చేశారు. సీఎం స్టాలిన్ కొడుకు, అల్లుడు పెద్దమొత్తంలో డబ్బులు కూడబెట్టుకున్నారని పీటీఆర్ అంటున్నట్టు ఆ ఆడియో ఉన్నది. తాజాగా విడుదల చేసిన వీడియోలో డీఎంకే, బీజేపీని ఆయన పోలుస్తున్నట్టు ఉన్నది.
 

చెన్నై: తమిళనాడులో అధికార డీఎంకే పార్టీపై బీజేపీ స్టేట్ చీఫ్ అన్నమళై వరుసగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవలే ఆయన ఓ ఆడియో క్లిప్ విడుదల చేశారు. డీఎంకే ఫైల్స్ అంటూ పేరు పెట్టి ఆయన విడుదల చేసిన ఆడియో క్లిప్‌లో సీఎం ఎంకే స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్, స్టాలిన్ అల్లుడు సబరీసన్‌లు భారీగా డబ్బులు కూడబెట్టుకున్నట్టు ఆరోపణలు చేశారు. ఉదయనిధి స్టాలిన్, సబరీసన్‌లు రూ. 30 వేల కోట్లు కూడబెట్టుకున్నట్టు రాష్ట్ర మంత్రి పీటీఆర్ మాట్లాడుతున్నట్టుగా వినిపిస్తున్న ఆడియో క్లిప్‌ను ఆయన ట్వీట్ చేశారు.

తాజాగా, మరో ఆడియో క్లిప్‌ను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమళై ట్వీట్ చేశారు. ఈ రెండో ఆడియో క్లిప్‌లో డీఎంకేను విమర్శిస్తూ బీజేపీని పొగుడుతూ పీటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నట్టు వినిపిస్తున్నాయి. బీజేపీలో ఒక వ్యక్తికి ఒక పోస్టు అనే రూల్ ఉన్నదని, డీఎంకేలో ఒక వ్యవస్థ అనేదే లేదని పీటీఆర్ పేర్కొంటున్నట్టు ఉన్నాయి. డీఎంకే, బీజేపీల మధ్య సరైన తేడాను గుర్తించినందుకు మంత్రి పీటీఆర్‌కు ధన్యవాదాలు అంటూ అన్నమళై కామెంట్ పెట్టారు.

Latest Videos

ఏప్రిల్ 14వ తేదీన అన్నమళై వీడియో రిలీజ్ చేశాడు. దాన్ని డీఎంకే ఫైల్స్ అని పేర్కొన్నారు. అందులో డీఎంకే నేతలు సుమారు రూ. 1.34 కోట్లు కూడబెట్టుకున్నారని ఆరోపించారు.

డీఎంకే ఈ ఆరోపణలను ఖండించింది. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ రూ.500 కోట్ల పరిహారం ఇవ్వాలని అన్నమళైకు లీగల్ నోటీసులు పంపింది.

తొలి ఆడియో క్లిప్ పై  శనివారం మంత్రి పీటీఆర్ స్పందించారు. రెండు పేజీల లేఖను ట్వీట్ చేశారు. ఆ ఆడియో క్లిప్ నకిలీదని, కుట్రపూరితంగా టెక్నాలజీ సహాయంతో తయారు చేశారని పేర్కొన్నారు. ఆ క్లిప్‌నకు సంబంధించిన ఫోరెన్సిక్ అనాలిసిస్ స్క్రీన్ షాట్లనూ ఆయన ట్వీట్ చేశారు.

తాను భావ ప్రకటన స్వేచ్ఛకు విలువనిచ్చే వాడినని, అనేక ఆరోపణలకు తాను స్పందించలేదనీ అన్నారు. కానీ, ఈ సారి తాను స్పందించ తప్పలేదని తెలిపారు. తాను స్పందించేలా బలవంతపెట్టే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండే టెక్నికల్ అనాలిసిస్ తో కూడా ఈ ఆడియో క్లిప్ నకిలీదని చెప్పవచ్చని తెలిపారు. ఇది ఆథెంటిక్ ఆడియో క్లిప్ కాదని తేలిపోతుందని వివరించారు.

Also Read: అమ్మవారి మీద ఒట్టు.. కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా నాశనమైపోతా : రేవంత్ రెడ్డి

కాగా, ఈ ట్వీట్‌కు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై స్పందించారు. ఆ ఆడియో క్లిప్ శాంపిల్ అనాలిసిస్ డీఎంకేనే చేసిందని వివరించారు. అంతేకానీ, ఏ స్వతంత్ర ఏజెన్సీతోనీ దీన్ని చెక్ చేయించలేదని పేర్కొన్నారు. ఒక స్వతంత్ర ఏజెన్సీకి ఆ ఆడియో క్లిప్ ఇచ్చి పరీక్షించే ధైర్యం డీఎంకే మంత్రికి ఉన్నదా అని సవాల్ చేశారు. 

click me!