
గత కొద్ది రోజులుగా టమాటా ధరలు (Tomato price) పెట్రోల్, డిజీల్ ధరలను దాటి పరుగులు పెడుతున్నాయి. భారీ వర్షాలు, దిగుమతి తగ్గడంతో టమాట ధరలకు రెక్కలు వచ్చాయి. చాలా చోట్ల కిలో టమాటా ధర సెంచరీ దాటేసింది. తమిళనాడులో అయితే కొన్ని చోట్ల కిలో టమాటా ధర రూ. 150కి చేరింది. చాలా చోట్ల టమాటా ధరలు రూ. 100కు పైగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు (tamil nadu) ముఖ్యమంత్రి స్టాలిన్ (CM Stalin) కీలక నిర్ణయం తీసుకున్నారు. టమాటా ధరలకు సంబంధించిన భారం ప్రజలపై పడకుండా చర్యలు తీసుకున్నారు. సహకార శాఖ పరిధిలోని దుకాణాల్లో కిలో రూ. 79కి విక్రయించేందుకు చర్యలు చేపట్టారు.
సహకార శాఖ ద్వారా కూరగాయలను తక్కువ ధరకి విక్రయించనున్నట్లు మంత్రి పెరియస్వామి (periyasamy) తెలిపారు. రాష్ట్రంలో కురుస్తున్న వానలకు కూరగాయల దిగుబడి తగ్గిందన్నారు. దీంతో ధరలు పెరిగిపోయాయి. కూరగాయల ధరలు నియంత్రించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశించారని తెలిపారు. ముఖ్యంగా టమాటా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా చెప్పారు. ధరలు మరింత పెరగొచ్చన్న సంకేతాలతో మహారాష్ట్ర నుంచి తమిళనాడు ప్రభుత్వం టమాటాలను దిగుమతి చేసుకుంటుంది. సహకారశాఖ పరిధిలోని దుకాణాల ద్వారా బుధవారం నుంచి కిలో టమాటా రూ. 79కి విక్రయించడం ప్రారంభించింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా టమాటా ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. భారీ వర్షాలతో మదనపల్లె ప్రాంతంలో దిగుబడి తగ్గడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇప్పుడు ఛత్తీస్‌ఘఢ్, మహారాష్ట్రలోని షోలాపూర్, కర్ణాటకలోని చిక్ బుల్లాపూర్ నుంచి వచ్చే టమాటాపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. ఇక ,హైదరాబాద్‌లో టమాటా ధర (Tomato price in hyderabad) నెల రోజుల క్రితం కిలో రూ. 20 నుంచి రూ. 30 ఉండగా ప్రస్తుతం రూ.100కు చేరింది.