తమిళనాడులో భారీ వర్షాలు: 25 మంది మృతి, స్కూళ్లకు సెలవులు

By narsimha lodeFirst Published Dec 3, 2019, 10:41 AM IST
Highlights

తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. వర్షాల కారణంగా ఇప్పటికే 25 మంది మృతి చెందారు. 

చెన్నై: తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఇవాళ కూడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ తరుణంలో  తమిళనాడు ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటుంది.  భారీ వర్షాల కారణంగా ఇప్పటికే 25 మంది మృత్యువాతపడ్డారు. వెయ్యి మందిని పునరావాస శిబిరాలకు తరలించారు.

 గత నెల 29వ తేదీ నుండి తమిళనాడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా  బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. వర్షాల కారణంగా మెట్టుపాళ్యం జిల్లాలోని నండూరు గ్రామంలో  గోడ కూలి 17 మంది మృతి చెందారు.ఈ ఘటనతో పాటు మరో 8 మంది కూడ మృతి చెందారు.

Also read:భారీ వర్షాలకు కూలిన గోడ... 17కి చేరిన మృతుల సంఖ్య

 ఈశాన్య రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి.దీంతో వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో సుమారు వెయ్యి మందిని  పునరావాస కేంద్రాలకు తరలించారు. టుటికొరిన్, కడలూరు, తిరునవెళ్లి జిల్లాల్లో వర్షం కారణంగా ప్రజలు  తీవ్రంగా ఇబ్బందులపాలయ్యారు.

చెన్నైకు సమీపంలోని   చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు కూడ నీట మునిగిపోయాయి.  తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి పళనిస్వామి సమీక్ష సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రిజర్వాయర్లలో నీటి మట్టం గురించి సీఎం ఆరా తీశారు. కడలూరు లో వేలూరు నది పొంగిపొర్లుతోంది.

మరో వైపు 58 పశువులు కూడ ఈ వర్షాల కారణంగా చనిపోయినట్టుగా తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈరోడ్ జిల్లాలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

ఈరోడ్ జిల్లాలోని భవానీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది.దీంతో ఈ ప్రాజెక్టు పరిధిలోని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున స్కూళ్లకు సెలవులను ప్రకటించింది ప్రభుత్వం.

వరద ప్రభావిత ప్రాంతాల్లో డిఎంకె చీఫ్ స్టాలిన్ పర్యటించారు. బాధితులను పరామర్శించారు. బాధితులకు ఆహార ప్యాకెట్లను అందించారు. వరద బాధితులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


  


 

click me!