'మేము దానిని వ్యతిరేకిస్తాం..' కర్ణాటక డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై విరుచుకపడ్డ తమిళనాడు.. అసలేం జరిగిందంటే?

By Rajesh KarampooriFirst Published Jun 1, 2023, 3:26 AM IST
Highlights

Mekedatu Project: మేకేదాటులో రిజర్వాయర్ లేదా మరేదైనా ఆమోదించబడిన నిర్మాణం తమిళనాడు ప్రయోజనాలను ప్రభావితం చేస్తుందని దురైమురుగన్ అన్నారు. కావేరి నది పరివాహక ప్రాంతాల్లో అనుమతి లేకుండా రిజర్వాయర్ నిర్మించడం సరికాదనీ, తాము ఎట్టి పరిస్థితిలో స్వాగతించబోమని తమిళనాడు సర్కార్ తెలిపింది.

Mekedatu Project: తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నది జలాలపై ఎలాంటి వివాదం ఉందో .. తమిళనాడులో కావేరీ నదిపై నిర్మించబోతున్న మేకెదాటు ప్రాజెక్టుపై తమిళనాడు, కర్ణాటక మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా మేకేదాటు వద్ద కావేరి నదిపై రిజర్వాయర్‌ నిర్మాణంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసింది. కావేరీ వివాదాల ట్రిబ్యునల్ ఉత్తర్వులోనూ, సుప్రీంకోర్టు తుది తీర్పులోనూ కర్ణాటకలో ప్రతిపాదిత రిజర్వాయర్‌ నిర్మాణం గురించి ప్రస్తావించలేదని శివకుమార్‌కు గుర్తు చేయాలని తమిళనాడు జలవనరుల శాఖ సహాయ మంత్రి దురైమురుగన్‌ కోరారు.

ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే (ఉప ముఖ్యమంత్రిగా) శివకుమార్ పొరుగు రాష్ట్రాన్ని ఆటపట్టించడం మాకు ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. మేకేదాటుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారుల నుంచి ఆయన తీసుకోలేదంటూ విరుచుకపడ్డారు. మేకేదాటు వద్ద అంతర్ రాష్ట్ర నది కావేరీపై రిజర్వాయర్ నిర్మించాలని శివకుమార్ తన ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలపై తమిళనాడు సీనియర్-మోస్ట్ మంత్రి దురైమురుగన్ స్పందించారు. ఈ ప్రాజెక్ట్ లేదా మరేదైనా అనుమతి లేని నిర్మాణం తమిళనాడు ప్రయోజనాలను ప్రభావితం చేస్తుందని అన్నారు. కావేరినదిపై (కర్ణాటక)అంతర్గత పరివాహక ప్రాంతంలో అనుమతి లేకుండా నిర్మాణాలు చెప్పడం సరికాదని, తాము ఎట్టి పరిస్థితిలోనూ స్వాగతించబోమని అన్నారు. తమిళనాడు ప్రతిచోటా వ్యతిరేకిస్తుందని చెప్పారు. మేకేదాటు వద్ద రిజర్వాయర్‌ నిర్మించాలని కర్ణాటక భావించడం సరికాదని అన్నారు. 

మేకేదాటు మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి?

మేకేదాటు బహుళార్ధసాధక (జలశక్తి) ప్రాజెక్ట్ కర్ణాటకలోని రామనగర జిల్లాలోని కనకపుర సమీపంలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మిస్తుంది.  ఈ ప్రాజెక్ట్ ద్వారా బెంగళూరు, పొరుగు ప్రాంతాలకు (4.75 TMC) తాగునీటిని అందించడం, 400 MW విద్యుత్ ఉత్పత్తి చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.9,000 కోట్లు.

click me!