"100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్" : రాజస్థాన్ సీఎం సంచలన ప్రకటన 

By Rajesh KarampooriFirst Published Jun 1, 2023, 2:35 AM IST
Highlights

ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు.

రాజస్థాన్ లోని అజ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ తర్వాత.. ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో మధ్యతరగతి ప్రజలకు ఊరట కల్పించేలా హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. 100 యూనిట్ల ఉచిత విద్యుత్, తదుపరి 100 యూనిట్లపై ఫిక్స్‌డ్ ఛార్జీలు, ఇంధన సర్‌చార్జ్ , ఇతర ఛార్జీలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు.

ద్రవ్యోల్బణం ఉపశమన శిబిరాల సమయంలో ప్రజలతో మాట్లాడిన తర్వాత.. రాజస్థాన్‌లో విద్యుత్ బిల్లులలో ఇచ్చిన శ్లాబ్‌ల వారీ మినహాయింపును మార్చాలని తనకు సలహా ఇచ్చారని గెహ్లాట్ చెప్పారు. దీంతో గెహ్లాట్ ప్రభుత్వం అందరికీ 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని తెలిపారు. మే నెలలో విద్యుత్ బిల్లులలో ఇంధన సర్‌చార్జికి సంబంధించి ప్రజలు తమ సలహాలను కూడా అందించారని, దాని ఆధారంగా తదుపరి 100 యూనిట్ల విద్యుత్‌పై నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

 అందరికీ 100 యూనిట్లు ఉచితం

రాజస్థాన్ పౌరులు ప్రతి నెలా 100 యూనిట్ల వరకు విద్యుత్తును పూర్తిగా ఉచితంగా పొందుతారని, అలాగే.. ప్రతి నెలా 200 యూనిట్ల వరకు విద్యుత్తు వినియోగించే వారికి ఫిక్స్‌డ్ ఛార్జీలు, ఇంధన సర్‌చార్జి, ఇతర ఛార్జీలను మాఫీ చేస్తామని సీఎం గెహ్లాట్ చెప్పారు. ఈ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందనీ పేర్కొన్నారు. ఈ ప్రయోజనం ఏ ఒక్క వర్గానికో మాత్రమే కాదనీ,  100 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఖర్చు చేసే వారు కూడా దాని ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. అంటే.. ఎక్కువ కరెంటు వాడినా మొదట్లో 100 యూనిట్ల కరెంటు అందరికీ పూర్తిగా ఉచితం, దానికి ఎలాంటి కరెంటు చార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. 

ఈ ఏడాది రాజస్థాన్‌లో ఎన్నికలు  

ఈ పథకాన్ని రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అనుసంధానం చేస్తున్నారు. నిజానికి కర్నాటకలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటును ప్రకటించి దాని లబ్ధి పొందింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంటు ద్వారా మరింత మందిని తమవైపు తిప్పుకోవాలని చూస్తోంది. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈసారి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తుంది. అటువంటి పరిస్థితిలో గెహ్లాట్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఫ్రీబీస్ రాజకీయాలు ఖచ్చితంగా షాక్ అవుతారు.

click me!