గుడిలో ప్రసాదంగా.. మటన్ బిర్యానీ

By ramya NFirst Published Feb 25, 2019, 12:56 PM IST
Highlights

గుడిలో ప్రసాదంగా బిర్యానీ పెట్టడం ఎక్కడైనా చూశారా..? అందులోనూ మటన్ బిర్యానీ. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. 

గుడిలో ప్రసాదంగా బిర్యానీ పెట్టడం ఎక్కడైనా చూశారా..? అందులోనూ మటన్ బిర్యానీ. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఓ గుడిలో ప్రసాదంగా మటన్ బిర్యానీనే పెడతారు. ముందు స్వామివారికి నైవేద్యంగా పెట్టి.. ఆ తర్వాత దానిని భక్తులకు ప్రసాదంగా పంచిపెడుతున్నారు. ఈ వింత ఆచారం తమిళనాడులోని మునీశ్వర ఆలయంలో గత కొన్నేళ్లుగా జరుగుతోంది.

 తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లా తిరుమంగళం సమీపంలోని వడుకంపట్టి గ్రామంలో గల మునీశ్వరుడి ఆలయంలో ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జరిగే ఉత్సవాల్లో మటన్ బిర్యానీని ప్రసాదంగా పంచుతారు. దీనిలో భాగంగా గతేడాది 2 వేల కిలోల బాస్మతీ బియ్యం, 200 మేక మాంసంతో బిర్యానీని తయారు చేసి ప్రసాదంగా అందించారు. ఈ ఏడాది కూడా ఇదే తరహలో స్వామి వారికి బిర్యానీ ప్రసాదాన్ని  అందించారు.

 అయితే, దీని వెనుక ఓ మంచి పురాణ కథ ఉంది. 85 ఏళ్ల క్రితం ఎస్వీఎస్‌ సుబ్బానాయుడు అనే వ్యక్తి మునీశ్వరుడు పేరుతో ప్రారంభించిన హోటల్‌కు బాగా లాభాలు వచ్చాయి. ఆ హోటల్ లో మటన్ బిర్యానీ ప్రత్యేకం.

దాంతో ఆ స్వామికి రెండేళ్ల పాటు మటన్‌ బిర్యానీతో నైవేద్యం సమర్పించిన అనంతరం భక్తులకు ప్రసాదంగా పంచారట. అప్పటి నుంచి గ్రామస్థులంతా కలిసి బిర్యానీ తయారు చేసి ప్రసాదంగా పంపిణీ చేయడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు రాష్ట్రంలో వందల సంఖ్యలో మునియాండి మాంసాహార హోటళ్లు వెలిశాయి. ఇప్పుడు ఆ హోటళ్లు అక్కడ ఫుల్ ఫేమస్.

బిర్యానీని బ్రేక్‌ఫాస్ట్‌గా తినడమన్నది ఈ ఆలయానికి చెందిన ప్రత్యేకతగా ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఎక్కడా ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ బిర్యానీ ప్రసాదం అందిస్తామని చెప్పారు. వడక్కంపట్టిలో దాదాపుగా అందరూ ఈ బిర్యానీకి అభిమానులే అన్నారు.చిన్నా పెద్దా అంతా కలిసి ఆనందంగా ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు.
 

click me!